గులాబీ దళపతికి ‘కమల’ కలవరం!

Mon Jan 27 2020 20:00:01 GMT+0530 (IST)

Reason Behind KCR Targets BJP In Telangana State

కేంద్రంలో అధికారం ఉంది.. బలం బలగం ఉంది.. అవసరమైతే ఏదైనా చేసే బెదిరించే వీలుంది. అందుకే బెంగాల్ టైగర్ మమతా లాంటి వారు కూడా బీజేపీ ముందు సాగిలపడ్డ పరిస్థితి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నిన్నటివరకూ ఎందుకొచ్చిన గొడవ అని సర్దుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవగానే ప్రతీసారి కాంగ్రెస్ ను తిట్టే కేసీఆర్ అనూహ్యంగా ఈసారి బీజేపీ మీద పడ్డారు. ఇన్నాళ్లు తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను టార్గెట్ చేసి కేసీఆర్ రాజకీయం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పని అయిపోవడంతో బీజేపీ పై విరుచుకుపడుతున్నారు.*కేసీఆర్ సడన్ గా బీజేపీని ఎందుకు తిట్టారు?

 ఇంత సడన్ గా గులాబీ దళపతి కేసీఆర్ బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఒకటే.. కాంగ్రెస్ కంటే బలంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కేసీఆర్  కూతురు కవిత పోటీచేసిన ఓడిన నిజామాబాద్ లో అయితే టీఆర్ఎస్ ను 13 సీట్లకే పరిమితం చేసి ఏకంగా 28సీట్లు సాధించి షాకిచ్చింది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 240 వార్డులను బీజేపీ కైవసం చేసుకొని గులాబీ పార్టీకి ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్ శివారులో అత్యధిక సీట్లు సంపాదించింది.

*ఒంటరిగా సత్తా చాటిన బీజేపీ

2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని మరీ బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన వార్డులు కేవలం 167 కాగా.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బీజేపీ ఏకంగా 240 సీట్లను సాధించడం.. 65 డివిజన్లు గెలుచుకొని ఏకంగా 71 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం సంపాదించి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ను మించి బీజేపీ అత్యధిక ఓటు శాతం పెంచుకోవడం గులాబీ శిబిరాన్ని కలవరపెడుతోంది.  తెలంగాణలోని 60శాతం మున్సిపాలిటీల్లో బీజేపీ ఉనికి ఉంది. ఒక్క అభ్యర్థి అయినా గెలిచి ఉన్నాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలోనూ బీజేపీ ఖాతా తెరవడం విశేషం.

* తెలంగాణలో టీఆర్ ఎస్ తర్వాత బీజేపీనేనా..?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 1.63 లక్షల ఓట్లు సంపాదించి అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బీజేపీ 75562 ఓట్లు సాధించి సత్తా చాటింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 72123 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.  అంటే తెలంగాణలో ఇప్పుడు గులాబీ పార్టీకి ప్రత్యామ్మాయం కేవలం బీజేపీయేనని మున్సిపల్ ఎన్నికలతో తేటతెల్లమైంది. ఓడిపోయిన చాలా వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. గతంతో పోలిస్తే బీజేపీ పొలిటికల్ గ్రాఫ్ ఏకంగా 100శాతం పెరగడం గమనార్హం.

*కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన బీజేపీ

ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలిచి బీజేపీ బొక్కబోర్లా పడింది. అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేసీఆర్ స్వయంకృతాపరాధాలతో 4 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది.  ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యం. ఏకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ఓటు షేరింగ్ లో తెలంగాణలోనే రెండో స్థానానికి ఎగబాకడం కమలనాథులను ఉత్సాహపరుస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్మాయంగా ఎదుగుతున్న బీజేపీని  ఇక ఉపేక్షించవద్దనే కేసీఆర్ కమలదళాన్ని టార్గెట్ చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.