కేసీఆర్ కేబినెట్ ముహుర్తం ఖరారు...ఆరోజే ఎందుకంటే...

Sun Jan 20 2019 18:24:44 GMT+0530 (IST)

Reason Behind KCR Cabinet Muhurtham

తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో  పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుండటం మంచి ముహూర్తాలు లేకపోవటంతో పెండింగ్ లో పెట్టిన కేసీఆర్ ఫిబ్రవరి 10 వసంత పంచమి రోజు కేబినెట్ విస్తరించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి విడత విస్తరణలో 8 మందికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మిగిలిన మంత్రివర్గాన్ని విస్తరిస్తూ మరో 8 మందికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.కాగా కొత్త కేబినెట్ కూర్పుపై ఇప్పటికే చర్చ జోరుగా సాగుతోంది. వసంతపంచమి రోజు కేబినెట్ విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్న నేపథ్యంలో...మొదటి విడతలో స్ధానం లభించే 8 మంది ఎవరనే అంశంపై ఇప్పటికే అధికార పార్టీలో ఉహాగానాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 10న జరిగే విస్తరణలో అవకాశం లభించే 8 మందిలో కొత్త వారికి ఛాన్స్ ఉండకపోవచ్చని పాతవారికే ఛాన్స్ లభిస్తుందని కొందరంటుంటే ఇద్దరైన కొత్తవారుంటారని మరికొందరు అంటున్నారు. తొలిదశ మంత్రివర్గ విస్తరణలో అందరూ సీనియర్లే ఉండే అవకాశం ఉందని పలు ఉదాహరణలు పేర్కొంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నేతలకు అవకాశం ఇస్తారని  పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇప్పటి దాకా తీసుకున్న నిర్ణయాలు చూస్తే పాత వారికి తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని ఆశావహులు అంటున్నారు.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు మినహా మిగతా అందరు సిట్టింగ్ లకు ఆయన టికెట్లు ఇచ్చారు. దీంతోపాటుగా తన కేబినెట్ సహచరులు అయిన మహమూద్ ఆలీ పోచారం శ్రీనివాస రెడ్డిలకు కీలక పదవులు కట్టబెట్టారు. ఇవన్నీచూస్తే సీఎం అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారనిపిస్తోందని పార్టీకి చెందిన నేతలు భావిస్తున్నారు. మంత్రివర్గంలో అవకాశం రాని వారిని వివిధ కీలక పదవుల్లో నియమించేందుకు కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమయం చిక్కిన్నప్పుడల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ  లిస్టు ముందు పెట్టుకుని ఎవరెవరికి ఏ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు ప్రగతి భవన్ వర్గాల సమాచారం.