Begin typing your search above and press return to search.

ఊ..ఊసరవెళ్లి..బాబు తీరు మరోసారి బట్టబయలు!

By:  Tupaki Desk   |   24 May 2020 6:36 AM GMT
ఊ..ఊసరవెళ్లి..బాబు తీరు మరోసారి బట్టబయలు!
X
రాజకీయాల్లో ఊసరవెళ్లులు ఉండడం కామన్. తెలుగు రాజకీయాల్లో ఆ క్రెడిట్ ను మన చంద్రబాబుకు దక్కుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఆయన యూజ్ అండ్ త్రో రాజకీయాలపై కథలు కథలు చెబుతుంటాయి. వాడుకొని వదిలేయడంలో బాబును మించిన నేత లేరంటూ కొనియాడుతుంటారు. నాడు ఎన్టీఆర్ ను గద్దెదించినప్పటి నుంచి నేటి వరకు బాబు అవసరార్థం చాలా మంది రాజకీయంగా వాడుకొని వారికి అడ్రస్ లేకుండా చేశారు. ఏ ఎండకాగొడుగు పట్టడంలో బాబు తీరే వేరంటారు.

ఇప్పుడు మొన్నటి ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని అంటకాగిన చంద్రబాబు తాజాగా ఆ జాతీయ పార్టీని తన లిస్ట్ నుంచి తొలగించారు.

2018 ఏప్రిల్ లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనన్న బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ తరువాత మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.

ఇక అంతటితో ఆగని చంద్రబాబు బీజేపీపై కక్షగట్టి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని కలిపి ఒక గొప్ప కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. ఎన్నికల సందర్భంగా పలు బహిరంగ సభలలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన వేదికను కూడా పంచుకున్నారు, మోడీపై తీవ్రంగా దాడి చేశారు.

మే 19 న ఎన్నికల చివరి రోజున, చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలుసుకున్నారు. ఫలితాల అనంతర సందర్భంలో అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని ఆమెతో చర్చించారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే మోడీకి క్లియర్ కట్ మెజార్టీ వచ్చి తిరిగి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నాయి.

తత్వం బోధపడిన చంద్రబాబు తొందరగా సర్దుకున్నాడు. కాంగ్రెస్ కాడిని వదిలేశాడు. ఏపీలోనూ ఓడిపోవడంతో ఇక సోనియా.. రాహుల్ ను కలవడానికి లేదా పలకరించే సాహసం కూడా చేయలేదు.

అనంతరం చంద్రబాబు యూటర్న్ తీసుకొని తన నలుగురు ఎంపీలను బీజేపీకి సాగనంపి కమలనాథులను కూల్ చేశారన్న ప్రచారం ఉంది. నరేంద్రమోడీ. ఆయన నాయకత్వం , నిర్ణయాలను ప్రశంసించడం చంద్రబాబు ప్రారంభించారు. టీడీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేనప్పటికీ బీజేపీకి సన్నిహితం కావడానికి చంద్రబాబు ప్రయత్నించారు. పలు లేఖలు రాసి రాయబారం నడిపారనే టాక్ ఉంది.

తాజాగా భారతదేశ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశంలోని ప్రతిపక్షాలు, అఖిలపక్షం నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రతిపక్షమైన చంద్రబాబు హాజరు అవుతారని అందరూ ఊహించారు. కానీ బాబు రంగులు మార్చారు. బీజేపీతోనే ఉంటానని.. కాంగ్రెస్ దోస్తీ వద్దంటూ సోనియా సమావేశానికి హాజరు కాలేదు.

దేశంలోని 22 జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు సోనియాగాంధీ వీడియోకాన్ఫరెన్స్ సమావేశానికి హాజరయ్యారు. కానీ మోడీ వ్యతిరేక బృందంలో భాగం కావడం ఇష్టం లేని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు దూరంగా జరిగారు. ఎన్టీఏ తలుపులు తెరిస్తే అందులో దూకడానికి రెడీ అయ్యారు. ఇలా బాబు ఏరుదాటాక తెప్పతగిలేసేలా రాజకీయం నడుపుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.