Begin typing your search above and press return to search.

మీడియా భేటీ రద్దు చేసిన బాబు.. దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   12 April 2019 8:13 AM GMT
మీడియా భేటీ రద్దు చేసిన బాబు.. దేనికి సంకేతం?
X
ఆసక్తికర వాదన ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్నికల క్రతువు మొదలైననాటి నుంచి మైండ్ గేమ్ విషయంలో దూసుకెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పోలింగ్ వేళలోనూ.. పోలింగ్ తర్వాత కూడా అదే తీరును ప్రదర్శిస్తుండటం విశేషం. పోలింగ్ మొదలైనప్పటి నుంచి విజయం తమదేనన్న భరోసాను వ్యక్తం చేస్తున్న జగన్ పార్టీ.. పోలింగ్ పూర్తి కాక ముందే.. విజయం తమదేనని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న మాట జగన్ నోటి నుంచి వచ్చేసింది.

ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి 9 గంటల వేళలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా భేటీకి ఆహ్వానించారు. ఎన్నికలు జరిగిన తీరు.. పోలింగ్ సరళితోపాటు.. విజయం మీద తమకున్న అంచనాల్ని చెప్పేందుకు వీలుగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేస్తూ.. అన్ని మీడియా హౌస్ లకు సమాచారాన్ని పంపారు.

మీడియాతో భేటీ అంటే చాలు.. అదే పనిగా గంటల తరబడి మాట్లాడే చంద్రబాబు.. తన తీరుకు భిన్నంగా ఆయన మీడియా భేటీని రద్దు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. మీడియా భేటీని క్యాన్సిల్ చేసుకున్నారంటే.. ఓటమిని ఒప్పుకున్నట్లేనని జగన్ పార్టీ వర్గం అభిప్రాయపడుతోంది. పోలింగ్ జరుగుతున్నంతసేపు హడావుడి చేసిన బాబు.. ఈసీ మీద అదే పనిగా విమర్శలు.. ఆరోపణలు చేశారని.. అలాంటి ఆయన మీడియా భేటీని రద్దు చేయటం చూస్తే.. గెలుపు మీద ఆశలు సన్నగిల్లినట్లుగా జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో మాట్లాడలేదన్న మాటను టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి.. ఇదే విషయం మీడియా భేటీకి ఆహ్వానం పంపటానికి ముందే ఆ ఆలోచన ఉండాలి కదా? అన్నది ప్రశ్నగా మారింది. దేశ రాజకీయాల్లో సీనియర్ అని తనకు తానే చెప్పుకునే చంద్రబాబుకు.. ఎన్నికల కోడ్ గురించి మీడియాకు ఇన్విటేషన్ పంపిన తర్వాత గుర్తుకు రావటమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. లెక్క ఏదో తేడా కొడుతున్నట్లుంది బాబు?