Begin typing your search above and press return to search.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీయట

By:  Tupaki Desk   |   28 Jun 2022 6:43 AM GMT
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీయట
X
మధ్యంతర ఎన్నికలు 2023లో వచ్చినా ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉన్నట్లు వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా లేదా 2023లో ఎన్నికలు జరిగినా రెడీ అంటు చాలెంజ్ విసిరారు. ఇదంతా ఎక్కడ కూర్చుని చాలెంజ్ చేశారంటే ఢిల్లీలో కూర్చుని. వైసీపీ తరపున గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఎక్కడో విభేదాలు మొదలై బాగా బాగా పెరిగిపోయింది.

ఎప్పుడైతే విభేదాలు బాగా పెరిగిపోయాయో నియోజకవర్గంలోని ఎంఎల్ఏలు, నేతల నుండి నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో నియోజకవర్గంలో తిరిగితే ఏమవుతుందో అన్న భయంతో నరసాపురంలో తిరగటమే మానేశారు. ఎక్కువకాలం ఢిల్లీలోనే కూర్చుంటున్నారు.

ఎప్పుడైనా హైదరాబాద్ కు వచ్చి వెళ్ళిపోతారంతే. ఒకసారి హైదరాబాద్ వచ్చినపుడే సీఐడీ అధికారులు విచారణకు విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత నుండి హైదరాబాద్ రావటం కూడా మానేశారు.

ఇలాంటి నేపధ్యంలో నరసాపురంలో మళ్ళీ పోటీకి రెడీ అంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. కేసులు, విచారణకు భయపడి ఎక్కడో ఢిల్లీలో కూర్చుని 24 గంటలూ 365 రోజులు జగన్ను టార్గెట్ చేస్తున్నారే కానీ ఆ చెప్పేదేదో నియోజకవర్గానికి వచ్చి చెప్పలేకపోతున్నారు. నియోజకవర్గంలో తిరగటానికే భయపడుతున్న తిరుగుబాటు ఎంపీ ఇక ఎన్నికల్లో ఎలా పోటీచేయగలరు ? ఎన్నికల్లో పోటీచేయాలంటే కనీసం నెలరోజులు నియోజకవర్గంలోనే ఉండాలికదా.

నామినేషన్ దాఖలకు ముందు తర్వాత కూడా నియోజకవర్గంలోనే ఉండి ప్రచారం చేసుకోవాలి. ప్రచారం చేయాలంటే రోజు ఎంతోమందిని వ్యక్తిగతంగా కలవాల్సుంటుంది. మరపుడు ఎక్కడైనా సమస్య వచ్చి కేసుపెట్టి విచారణకు అదుపులోకి తీసుకుంటే ఏమిచేస్తారు ? పోలీసులు తలచుకుంటే ఏమైనా చేయవచ్చని మళ్ళీ ఎంపీయే చెబుతున్నారు.

ఇన్ని వైరుధ్యాల మద్య 2023లో ఎన్నికలకు రెడీ అని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. బహుశా ఢిల్లీలో కూర్చునే నామినేషన్ దాఖలు చేసి అక్కడి నుండే ప్రచారం చేస్తారేమో. మొత్తానికి గెలుపోటములను పక్కన పెట్టేస్తే వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు ఎన్నిక మాత్రం సంచలనాలకు కేంద్రబిందువ్వటం ఖాయమనే అనిపిస్తోంది.