అభ్యర్థులను అనౌన్స్ చేశాకా పొత్తేంటి రాహుల్!

Wed Apr 24 2019 17:36:18 GMT+0530 (IST)

Ready for alliance with AAP if Haryana demand is dropped says Rahul Gandhi

రాహుల్ గాంధీ రాజకీయంగా ఇంకా ఎదగలేదు.. ఆయన ఆలోచన సరళి సమకాలీన రాజకీయాలను అందుకోలేకపోతోంది అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పక తప్పదు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు వ్యవహారం చాలు రాహుల్ గాంధీ ఇంకా రాజకీయంగా పరిణతి సాధించలేదు  అని చెప్పడానికి. ఢిల్లీలో పరిస్థితులు గతంలా లేవు.కాంగ్రెస్ పార్టీ - ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల అక్కడ బీజేపీని ఓడించకపోగా.. ఓట్లను చీల్చుకుని బీజేపీ గెలుపును మరింత సులభం చేయనున్నాయి ఈ పార్టీలు. కాస్త అవగాహన ఉన్న వారు ఎవరైనా చెప్పే మాట ఇది. అయితే ఇన్ని రోజులు అవకాశం ఉన్నా.. ఢిల్లీలో ఏడు సీట్ల విషయంలో పొత్తును కుదర్చుకోలేకపోయాయి కాంగ్రెస్ - ఆప్ లు.

ఢిల్లీలో కొన్ని సీట్ల త్యాగానికి సై అన్న ఆమ్ ఆద్మీ పార్టీ తమకు పంజాబ్ లో - హర్యానాలో కొన్ని సీట్లను ఇవ్వమని కోరింది. దానికి కాంగ్రెస్ ససేమేరా అంది. దీంతో ఆప్ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ తో పొత్తుకు నో చెప్పింది. అభ్యర్థులను కూడా ప్రకటించేసుకున్నాయి ఈ ఇరు పార్టీలు. ఇలాంటి సమయంలో రాహుల్ స్పందిస్తూ.. ఆప్ తో పొత్తుకు ఇప్పుడు కూడా రెడీ  అని అంటున్నారు!

కావాలంటే ఢిల్లీలో తమ అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకోవడానికి రెడీ అన్నట్టుగా రాహుల్ చెప్పుకొచ్చారు. ఇందుకే రాహుల్ ను రాజకీయంగా జనాలు సీరియస్ గా తీసుకోంది! పొత్తు గురించి అన్ని రోజుల పాటు  హడావుడి చేసి తీరా అభ్యర్థులను ప్రకటించేశాకా మళ్లీ పొత్తు అని రాహుల్ ట్వీట్ చేస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల మీద ఏ మేరకు స్పష్టత ఉందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాహుల్ తెలివైన వారే అయితే పంజాబ్ లో ఆప్ కు సీట్లు ఇవ్వకున్నా కనీసం హర్యానా వరకూ సీట్లు ఇచ్చి.. ఢిల్లీ హర్యానాల్లో ఇరు పార్టీలూ చెరి సగం సీట్లలో పోటీ చేసి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేవని విశ్లేషకులు అంటున్నారు. అయితే హర్యానాలో అంత అనుకూలత లేకపోయినా అతిగా వెళ్లి రాహుల్ గాంధీ ఆప్ ను అనసవరంగా దూరం చేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.