టీడీపీకి మాజీ ఎంపీ బెదిరింపులు!

Tue Jan 24 2023 11:50:14 GMT+0530 (India Standard Time)

Rayapati SambasivaRao Comments on TDP

నరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్లకిస్తే ఓడిస్తామని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేట నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయపాటి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పుట్టా సుధాకర్ పేరు ఎత్తకుండా కడప వాళ్లకు సీటు ఇస్తే తమ వర్గం సహకరించదని రాయపాటి తేల్చిచెప్పారు.అలాగే గుంటూరు జిల్లాలో తాడికొండ నియోజకవర్గ టికెట్ ను తోకల రాజవర్దన్ రావుకు ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు ఆల్టిమేటం జారీ చేశారు. అలాగే తన కుమార్తె కుమారుడు పోటీ చేయడానికి వీలుగా తన కుటుంబానికి రెండు అసెంబ్లీ సీట్లు కావాలని రాయపాటి కోరుతున్నారు. గుంటూరు పశ్చిమ సత్తెనపల్లి పెదకూరపాడుల్లో రెండు సీట్లు తన కుటుంబానికి కేటాయించాలనేది రాయపాటి డిమాండ్ గా ఉందని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకోవడం లేదన్నారు. తన కుటుంబం నుంచి తన కుమారుడు కుమార్తె పోటీ చేస్తారన్నారు. ఈ మేరకు వీరిద్దరికి  రెండు అసెంబ్లీ సీట్లు కావాలని గతంలోనే చంద్రబాబును అడిగామని రాయపాటి గుర్తు చేశారు. తాడికొండ సీటును తోకల రాజవర్ధన్‌రావుకు ఇవ్వాలన్నారు. ఆయన అక్కడ ఖచ్చితంగా గెలుస్తారని స్పష్టం చేశారు.

 నరసరావుపేట ఎంపీ సీటు కడపోళ్లకు ఇస్తే ఓడించి తీరతామని స్పష్టం చేశారు. అవసరమైతే తానే ఎంపీగా పోటీ చేస్తానని రాయపాటి తెలిపారు. తాను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికి రారన్నారు. తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోబోమని çహాట్ కామెంట్స్ చేశారు.

కాగా రాయపాటి సాంబశివరావు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. పొగాకు వ్యాపారాలు ఉన్న ఆయన ఇప్పటివరకు గుంటూరు నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. 1996 1998 2004 2009ల్లో గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన రాయపాటి ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగాక టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో నరసరావుపేట నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. గతంలో ఒక పర్యాయం కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగానూ వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాయపాటి వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓటమి పాలయ్యారు.

కాగా వచ్చే ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు.. నరసరావుపేట ఎంపీగా తనకు సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమారుడు రాయపాటి రంగారావుకు సీట్లు కావాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే కుటుంబంలో ఒకరికి ఒక్క సీటే ఇస్తామని టీడీపీ ఆయనకు తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో ఆయన టీడీపీపైన కొంత అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

అంతేకాకుండా గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు సభలకు తనను ఆహ్వానించడం లేదని ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని తాను చెప్పినప్పటికీ.. కనీసం టీడీపీని సమర్థిస్తున్న మీడియాలోనూ ఈ వార్తకు ప్రాధాన్యత కల్పించకపోవడం పట్ల ఆయన కినుక వహించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.