ఏపీ గురించి జేపీ బాగా చెప్పాడు

Mon Oct 26 2015 16:27:24 GMT+0530 (IST)

Rayalaseema, North Andhra worse off than special States: Jayaprakash Narayan

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీపై రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ఒత్తిడి తెస్తే బాగుండేదన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా ఇదే విషయం చెబుతూ ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల కంటే ఏపీలోని ఏడు జిల్లాల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన చెబుతున్నారు. అందుకు గణాంకాలు కూడా ఆయన ఆధారంగా చూపిస్తున్నారు.ఏపీలోని నాలుగు రాయలసీమ జిల్లాలు మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పరంగా ఎంతగానో వెనుకబడ్డాయని... ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లో పరిస్థితుల కంటే ఇక్కడ దుర్భర పరిస్థితులు ఉన్నాయన్నది జేపీ మాట. కేంద్రం రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని చెబుతున్నా అది గొప్ప విషయమేమీ కాదు... పలు ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ఏపీకి కూడా ఇస్తోందని ఆయన అంటున్నారు.

దేశంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలతో ఏపీలోని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలను జేపీ పోల్చారు. ప్రత్యేక హోదా ఉన్న అస్సాంలో శిశుమరణాల రేటు 55(ప్రతి వెయ్యి మందికి)గా ఉందని.. హిమాచల్ ప్రదేశ్ లో 32 ఉత్తరాఖండ్ లో 36 జమ్మూకాశ్మీర్ లో 41 ఉండగా ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఈ రేటు 44.5గా ఉంది. మానవాభివృద్ధి సూచి పరంగా చూసుకుంటే రాయలసీమ ఉత్తరాంధ్రలు ప్రత్యేక హోదా రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లోనూ వెనుకబడే ఉన్నాయి.

అక్షరాస్యత చూసుకుంటే అస్సాంలో 77.19 శాతం హిమాచల్ లో 82.8 ఉత్తరాఖండ్ లో 78.82 జమ్మూకాశ్మీర్ లో 67.16 శాతం ఉండగా రాయలసీమలో మాత్రం 66.34 శాతం మాత్రమే అక్షరాస్యులున్నాయి. మహిళా అక్షరాస్యతలో మరింత వెనుకబాటుతనం ఉంది. తాగునీటి సదుపాయం మరుగుదొడ్లు వంటి విషయాల్లోనూ రాయలసీమ ఉత్తరాంధ్రలు చాలా వెనుకంజలో ఉన్నాయి.

ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం చూసుకున్నా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు హిమాచల్ లో 8 శాతం ఉంటే ఉత్తరాఖండ్ జమ్మూకాశ్మీర్ లలో వరుసగా 11.26 10.35 శాతం ఉన్నారు. రాయలసీమలో మాత్రం వారి సంఖ్య 28 శాతం. ఇలా ఏ రంగంలో చూసుకున్నా రాష్ట్రంలోని సగం కంటే ఎక్కువ జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. ప్రత్యేక హోదా కావాలనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణలే అవసరం లేదు.