Begin typing your search above and press return to search.

ఐపీఎల్: రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెడిందా?

By:  Tupaki Desk   |   12 May 2022 1:53 PM GMT
ఐపీఎల్: రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెడిందా?
X
భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బుధవారం పక్కటెముకల గాయం కారణంగా ఐపీఎల్- 2022 సీజన్‌లోని మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. జడేజా అందుబాటులో లేకపోవడం గురించి సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. అయితే జడేజా.. సీఎస్కే ఫ్రాంచైజీ మధ్య చెడిందని.. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో విభేదాలు పొడచూపాయని.. అందుకే జడేజా అలిగి తప్పుకున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాన్ని అన్‌ఫాలో చేసాడు. దీంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్టైంది. ఈ పుకార్లపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. జడేజా పూర్తిగా వైద్య కారణాలతో జట్టు నుంచి బయటకు వెళ్లాడని.. అతను తిరిగి చెన్నై టీంలోకి వస్తాడని చెప్పాడు. సీఎస్కే తో భవిష్యత్తులో జడేజా కొనసాగుతాడా? అని అడిగినప్పుడు.. కాశీ విశ్వనాథన్ ఆసక్తికరంగా స్పందించాడు. అతను ఎల్లప్పుడూ సీఎస్కే తోనే ఉంటాడని.. దృఢంగా మాతోనే కొనసాగుతాడని చెప్పాడు.

అయినా పుకార్లు ఆగలేదు. బహుశా వచ్చే ఏడాది కూడా జడేజా సీఎస్కే తో ఉండకపోవచ్చని మాజీ క్రికెటర్.. వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఆరోపించారు.. ఈ ప్రకటన ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చినట్టైంది.

2022 ఐపీఎల్ ప్రారంభానికి ముందు మెగా వేలం జరిగింది.. సీఎస్కే జడేజాను 16 కోట్ల రూపాయలకు అట్టిపెట్టుకుంది. ఇది చెన్నై తరుఫున అత్యధిక ధర. ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోని తప్పుకోవడంతో జడేజాను కెప్టెన్‌గా నియమించారు. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. ఐపీఎల్ చరిత్రలో సిఎస్‌కే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో జడేజా కెప్టెన్సీ పై విమర్శలు వచ్చాయి. అతడి నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు వచ్చాయి. దీంతో ఎనిమిది గేమ్‌ల తర్వాత జడేజా తన కెప్టెన్సీని వదిలేసి మళ్లీ ఎంఎస్ ధోనీకి కెప్టెన్సీని తిరిగి అప్పగించాడు.

ఇక సడెన్ గా జడేజాను జట్టు నుంచి తప్పించారు. ఆటగాడిగా కూడా విఫలం కావడంతో పక్కనపెట్టినట్టు సమాచారం. దీంతో అతడి స్థానంలో వేరొకరిని తీసుకొని ఢిల్లీతో మ్యాచ్ లో ఆడారు. ఆ తర్వాత జడేజాకు గాయమైందని ప్రకటించారు. ఆ తర్వాత సీఎస్కేను జడేజా అన్ ఫాలో చేయడంతో ఈ వివాదం రాజుకుంది. జడేజా భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. దశాబ్ద కాలంగా చెన్నై జట్టులో ఉన్న జడేజా వచ్చే సీజన్‌లో మరో జట్టుతో ఉంటే ఆ రూమర్స్ నిజమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.