Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో ఓడాక పవన్ లో మార్పు వచ్చిందట!

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:29 AM GMT
ఎన్నికల్లో ఓడాక పవన్ లో మార్పు వచ్చిందట!
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడు రాజు రవితేజ్. అతడి గురించి పవన్ ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు కూడా. ఆ మాటకు వస్తే.. పవనిజం పేరుతో పుస్తకం రాసింది కూడా అతడే. అంత సన్నిహితంగా ఉండే రవితేజ్ పవన్ పార్టీ నుంచి బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా అధినేత మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

పార్టీకి రాజీనామా చేస్తూ రవితేజ్ లేఖ రాయటం.. అందుకు స్పందించిన పార్టీ అతడి రాజీనామాను అంగీకారం తెలుపుతూ లేఖను విడుదల చేయటం తెలిసిందే. అయితే.. రవితేజ్ రాజీనామా వెనుక జగన్నాటకం ఉందంటూ కెలికిన పార్టీ వ్యాఖ్యలతో రవితేజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఆయన బయటకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చారంటూ చేసిన వ్యాఖ్యపైనా నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన రవితేజ్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ ను నమ్మొద్దని తేల్చారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. పార్టీ కోసం చాలా చేద్దామనుకున్నా తనకు స్వేచ్ఛ లేదన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత పవన్ లో మార్పు వచ్చిందన్నారు. పార్టీలో అంతర్గత పారదర్శకత లేదని.. మతాల ప్రస్తావన లేని రాజకీయాలు జనసేన సిద్ధాంతమని కానీ పార్టీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.

పవన్ ఎవరి సలహాలు తీసుకోరని.. ఒకవేళ ఎవరైనా సలహాలు ఇస్తే.. అలాంటి నేతల్ని పక్కన పెడతారన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉండాలనే సూచనలు వస్తున్నాయని.. ఆ నిర్ణయాన్ని తాను సమర్థించలేనన్నారు. ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ వాళ్లనే పవన్ ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కులమతాలకు అతీతంగా ఉండే పవన్.. ఇప్పుడు అదే అంశాలతో రాజకీయ లబ్థి పొందాలని భావిస్తున్నట్లు ఆరోపించారు.

సొంత పార్టీ వ్యక్తులపై స్కెచ్ లు వేయటం.. వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తనకు నచ్చలేదన్న రవితేజ్.. సమాజాన్ని విభజించే శక్తులతో కలిసి పని చేస్తున్నట్లు మండిపడ్డారు. ఏ సిద్దాంతాలతో పార్టీని పెట్టారో ఇప్పుడు అదే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పవన్ పని చేస్తున్నట్లు చెప్పారు. జనసేనకు తాను రాజీనామా చేశానని.. భవిష్యత్తులో తాను ఏ పార్టీలో చేరనని తేల్చి చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడు తనపై చేసిన ఆరోపణలకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.