Begin typing your search above and press return to search.

ఏంది ర‌విప్ర‌కాశ్‌.. 30 సిమ్ కార్డులు మార్చారా?

By:  Tupaki Desk   |   21 May 2019 5:17 AM GMT
ఏంది ర‌విప్ర‌కాశ్‌.. 30 సిమ్ కార్డులు మార్చారా?
X
త‌న‌తో మొద‌లైన సంస్థ వేరే వారి చేతిలోకి వెళ్లిన‌ప్పుడు బాధ ఉంటుంది. అంత వేద‌నే ఉంటే.. వేరే వారి చేతుల్లోకి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. కంపెనీని వేరే వారు కొన్నా ఫ‌ర్లేదు కానీ ప‌గ్గాలు మాత్రం నా చేతిలోనే ఉండాల‌న్న వాద‌న స‌రికాదు. స‌రిగ్గా ఈ విష‌యంలోనే టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ ఇమేజ్ మ‌స్తు డ్యామేజ్ అయ్యింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

మోసం.. ఫోర్జ‌రీ.. డేటా చౌర్యంతో పాటు.. ఛాన‌ల్ లోగోల్ని ఆక్ర‌మ ప‌ద్ద‌తుల్లో వేరే వారికి అమ్మేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ర‌విప్ర‌కాశ్ కోసం సైబ‌రాబాద్‌.. బంజారాహిల్స్ పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల విష‌యంలో పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రై స‌మాధానాలు చెప్పాల‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు కోర‌టం..నోటీసులు ఇవ్వ‌టం తెలిసిందే.

పోలీసులు నోటీసులు ఇచ్చిన త‌ర్వాత నుంచి క‌నిపించ‌కుండా పోయిన ర‌విప్ర‌కాశ్ పైన లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ర‌విప్ర‌కాశ్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు స‌రికొత్త విష‌యాన్ని గుర్తించారు. పోలీసుల దృష్టిలో ప‌డ‌కుండా ఉండేందుకు.. త‌న జాడ‌ను ట్రేస్ చేసేందుకు వీలు లేకుండా చేసేందుకు దాదాపు 30 సిమ్ కార్డుల‌ను వాడిన‌ట్లుగా గుర్తించారు. ఎప్ప‌టిక‌ప్పుడు సిమ్ కార్డుల్ని మార్చేస్తూ.. త‌ప్పించుకున్న‌ట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు.

తాను ఎక్క‌డ ఉన్న విష‌యాన్ని తెలుసుకోకుండా ఉండేందుకు వీలుగా వైఫై ద్వారా.. వాట్సాప్ కాల్స్ లో మాత్ర‌మే మాట్లాడుతున్న ఆయ‌న్ను అదుపులోకి తీసుకునేందుకు తెగ ట్రై చేస్తున్న‌ట్లుగా అనుమానిస్తున్నారు. ర‌విప్ర‌కాశ్ ఆచూకీ త‌మ‌కు దొరికింద‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న్ను అదుపులోకి తీసుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను ఒక ఉన్న‌తాధికారి వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించ‌టం.. ఆ ద‌ర‌ఖాస్తుపై విచార‌ణ రేపు (బుధ‌వారం) జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. కోర్టు నిర్ణ‌యం త‌ర్వాత ఆయ‌న అరెస్ట్ ఉంటుందంటున్నారు. కోర్టులో బెయిల్ రాకుండా.. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన ఒక‌ట్రెండు రోజుల‌కే ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.