Begin typing your search above and press return to search.

ఏపీలో రేపటి నుంచి రేషన్ షాపులు బంద్...సమ్మెకు పిలుపిచ్చిన డీలర్లు..!

By:  Tupaki Desk   |   9 May 2021 12:20 PM GMT
ఏపీలో రేపటి నుంచి రేషన్ షాపులు బంద్...సమ్మెకు పిలుపిచ్చిన డీలర్లు..!
X
ప్రతిపక్ష నేతగా వైస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ' ఇంటింటికి రేషన్ పంపిణీ' కార్యక్రమాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రేషన్ బియ్యం పంపిణీ చేయడానికి ఆసక్తి ఉన్నవారికి సబ్సిడీతో వాహనాలను ప్రభుత్వం అందజేసింది. అయితే ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో కొద్దిరోజులకే సమస్యలు తలెత్తాయి.

తమకు ఇస్తున్న వేతనం సరిపోవడం లేదంటూ రేషన్ వాహనాల డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వం వారికి రూ. 5 వేల వేతనాన్ని పెంచుతూ మొత్తం జీతం రూ. 21 వేలు చేసింది. వేతనాలు పెంచి కొద్ది రోజులు కూడా కాకముందే మరో సారి వాహనాల డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకు అందజేసిన సబ్సిడీ వాహనాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. అలాగే రేషన్ బియ్యం పంపిణీ చేయాలంటూ ఒత్తిళ్లు రావడంతో డీలర్లు రేపట్నుంచి రేషన్ షాపులు బంద్ చేసి సమ్మెకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో రేషన్ డీలర్లే బియ్యం, చక్కెర తదితర నిత్యావసరాలను పంపిణీ చేసేవారు. వైసీపీ ప్రభుత్వం సబ్సిడీతో రేషన్ వాహనాల్ని పంపిణీ జేసి ఆపరేటర్లకు వేతనం ఇస్తోంది. వారి ద్వారానే ఇంటింటికి బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం తెల్ల కార్డు కలిగి ఉన్న ప్రతి ఇంట ఒక్కో వ్యక్తికి 10 కిలోల చొప్పున రెండు నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు నెలల పాటు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో రేషన్ వాహనాల డ్రైవర్లు తమకు అదనంగా వేతనం ఇస్తేనే అదనపు పని చేపడతామని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం రేషన్ డీలర్ల తోనే బియ్యం పంపిణీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారులు రేషన్ డీలర్ల పై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే వారు మాత్రం ఇప్పటికే తాము బియ్యం పంపిణీ చేయకుండా సాఫ్ట్ వేర్ తొలగించారని, అదనపు పని చేయడం కుదరదని తెగేసి చెబుతున్నారు.

ఉచిత బియాన్ని పంపిణీ చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్లకు నిరసనగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించినట్లు సమాచారం. తమను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, కరోనా వ్యాక్సిన్ అందజేయాలని, అలాగే తమకు బీమా వర్తింపజేయాలని డీలర్లు కోరుతున్నారు.


ఇదిలా ఉండగా ఇంటింటికి వెళ్లి నిత్యావసరాల పంపిణీ చేసే రేషన్ వాహనాల ఆపరేటర్లు ప్రభుత్వం అందజేస్తున్న వేతనం తమకు సరిపోదంటూ వాహనాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ లో 20 మంది వాహన ఆపరేటర్లలో పది మంది తమ వాహనాలను తహసీల్దార్ కార్యాలయంలో తిరిగి అప్పగించారు. తమకు వేతనంగా 21,000 ఇస్తున్నారని, అది వాహన పెట్రోల్, ఈఎంఐ, బియ్యం ఇంటికి పంపిణీ చేసే హమాలీలకు ఇవ్వడానికే సరిపోతుందని, ఇక తమకు మిగిలేది ఏమీ లేదని వారు వాపోతున్నారు.వాహనాలు తీసుకునే సమయంలో ఒక్కొక్కరం రూ. 70 వేల వరకు ఖర్చు చేశామని ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తే తమ దారి తాము చూసుకుంటామని అధికారులకు స్పష్టం చేశారని తెలుస్తోంది.