Begin typing your search above and press return to search.

సంచలనం: ఎంపీపై రేప్ కేసు

By:  Tupaki Desk   |   14 Sep 2021 10:49 AM GMT
సంచలనం: ఎంపీపై రేప్ కేసు
X
లోక్ జనశక్తి ఎంపీ ప్రిన్స్ పాశ్వాన్ పై రేప్ కేసు నమోదు కావడం సంచలనమైంది. కోర్టు ఆదేశాల మేరకే ఆయనపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గురువారం అందిన కోర్టు ఆదేశాల మేరకు వివిధ సెక్షన్ల కింద ప్రిన్స్ పాశ్వాన్ కాన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ప్రిన్స్ పాశ్వాన్ బీహార్ లోని సమస్తీపుర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కొద్ది నెలల కిందటే ఎల్జేపీకి చెందిన మహిళా కార్యకర్త ఆయనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్స్ పాశ్వాన్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు పార్టీలోని మహిళ నేత ఈ ఏడాది జూన్ లో ఫిర్యాదు చేసి ఆరోపించింది.ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడని ఆరోపించింది.

లైంగిక వేధింపుల గురించి బాబాయ్ పశుపతి పరాస్ కు తెలియజేస్తూ ఈ ఏడాది మార్చి 29న లేఖ రాసినట్టు ఎంపీ చిరాగ్ పాశ్వాన్ జూన్ 17న మీడియాకు లేఖ విడుదల చేశారు. కొద్దిరోజులుగా పార్టీతో సంబంధం ఉన్న ఒక మహిళ ప్రిన్స్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తోందని.. దీనిపై దోషి ఎవరో తేల్చేందుకు పోలీసుల వద్దకు వెళ్లమని మహిళకు తాను సలహా ఇచ్చానని చిరాగ్ లేఖలో తెలిపారు.

ఎల్జేపీలో మూడు నెలల కిందట సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. రాంవిలాస్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ను ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. చిరాగ్ తో కలిసి ఆ పార్టీ తరుఫున ఆరుగురు లోక్ సభ సభ్యులు ఉండగా.. అందులో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారు. చిరాగ్ చిన్నాన్న, ఎంపీ పశుపతి పరాస్ ను తమ అధ్యక్షుడిగా పార్టీ నేతలు ఎన్నుకున్నారు.