జనసేన మనుగడపై రాపాక సంచలన వ్యాఖ్యలు

Tue Aug 11 2020 15:00:20 GMT+0530 (IST)

Rapaka sensational comments on Janasena survival

గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే సీటును సాధించింది. అదే తూర్పు గోదావరి జిల్లాలోని రాజోల్  నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గెలిచారు.ఎన్నో ఆశలతో రెండు స్థానాల్లో పోటీచేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ రెండు చోట్ల ఓడిపోయాడు. ఆయన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక మాత్రం జనసేన సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళుతున్నాడు. అస్సలు పవన్ మాటే వినడం లేదు. వైసీపీ పంచన చేరి జగన్ కు సాన్నిహిత్యంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా రాపాక జనసేనపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం వైసీపీ వైపే ఉన్నానని స్పష్టం చేశారు. జనసేన నుంచి గెలిచానని.. కానీ ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియదన్నారు.

జనసేన పార్టీపై ఇష్టం లేకపోయినా కొంతమంది తనను చూసే ఓటు వేశారని రాపాక స్పష్టం చేశారు. వైసీపీలో వర్గాలు ఉండవచ్చని.. కానీ అధినేత ఒక మాట చెబితే గొడవలు ఉండవని రాపాక తెలిపారు. తాను గెలిచిన తర్వాత జగన్ ను కలిశానని.. టికెట్ ఇవ్వలేకపోయానని సీఎం తనతో అన్నారని రాపాక తెలిపారు.