Begin typing your search above and press return to search.

రాపాక సస్పెండ్ చేయంటుంటే.. పీకే మౌనం ఎందుకో?

By:  Tupaki Desk   |   13 Aug 2020 2:30 AM GMT
రాపాక సస్పెండ్ చేయంటుంటే.. పీకే మౌనం ఎందుకో?
X
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రారంభించిన రాజకీయ పార్టీ జనసేన నిజంగానే ఇప్పుడు అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు కదలలేక నానా తంటాలు పడుతోందనే చెప్పాలి. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా... ఆ పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ మరింతగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఇతరుల నుంచి ఎలా ఉన్నా... మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున విజయం సాధించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నుంచే... అంటే సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే పవన్ కు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయనే చెప్పాలి. నన్ను సస్పెండ్ చేయండి మహాప్రభో అని రాపాక డిమాండ్ చేస్తున్నా... ఆ దిశగా పవన్ చర్యలు తీసుకోని పరిస్థితులు ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేపుతున్నాయి.

ఎన్నికలు ముగిసింది మొదలు... జనసేన టికెట్ పైనే ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక... పార్టీకి విరుద్ధంగా వైసీపీతో కలిసి సాగుతున్నారు. సీఎం హోదాలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు జైకొడుతూ.. జనసేనను, ఆ పార్టీ అధినేతగా ఉన్న పవన్ ను ఎప్పటికప్పుడు దునుమాడుతూ సాగుతున్నారు. తాజాగా మంగళవారం ఏకంగా జనసేన ఓ గాలి వాటం పార్టీ అని, ఆ పార్టీ టికెట్ పైనే నిలిచినా... తాను సొంత బలంతోనే గెలిచానని కూడా రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను జగన్ తో కలిసి వైసీపీలోనే సాగుతున్నట్లుగా కూడా రాపాక చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు మంళవారం పెను దుమారమే రేపాయి.

తాజాగా బుథవారం మరో అడుగు ముందుకేసిన రాపాక... తాను జనసేనను గానీ, పార్టీ అధినేత పవన్ ను గానీ దూషించలేదని, పార్టీకి వ్యతిరేకంగా సాగలేదని పేర్కొని మరో సంచలనం రేపారు. పార్టీకి వ్యతిరేకంగా తాను సాగుతున్నానని జనసేన అధిష్ఠానం అనుకుంటే... తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని కూడా రాపాక వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనుకుంటే.. తక్షణమే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా రాపాక డిమాండ్ చేశారు. మొత్తంగా తనను సస్పెండ్ చేయాలని స్వయంగా డిమాండ్ చేసిన రాపాక... జనసేనను, పవన్ కల్యాణ్ ను ఓ రకమైన ఆత్మరక్షణలో పడేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.