రామోజీ సిగలో మరో నాలుగు కొత్త ఛానళ్లు!

Thu Jul 09 2015 15:07:51 GMT+0530 (IST)

Ramoji rao to Starts Four new channels

మీడియా మొఘల్ మరోసారి జూలు విదులుస్తున్నారా? అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట టీవీ ఛానళ్ల గురించి కనీస అవగాహన లేని రోజుల్లోనే ఒకేసారి పలు భాషలకు చెందిన ఛానళ్లను స్టార్ట్ చేసి సంచలనం సృష్టించిన ఘనత రామోజీకి మాత్రమే దక్కింది. కట్ చేస్తే.. తర్వాత  జరిగిన పరిణామాలతో తెలుగు ఛానళ్లకు మాత్రమే తన దగ్గర ఉంచుకొని మిగిలిన ఛానళ్లను రిలయన్స్‌కు అమ్మేయటం తెలిసిందే.ఆ తర్వాత మళ్లీ కొత్త ఛానళ్ల గురించి పెద్దగా పట్టనట్లు ఉన్న రామోజీ.. ఇప్పుడు మరోసారి నాలుగు ఛానళ్లను ఒకేసారి స్టార్ట్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. వాస్తవానికి ఈ మధ్యనే ఒరియా ఛానల్ స్టార్ట్ చేసిన రామోజీ.. తాజాగా మరో నాలుగు తెలుగు ఛానళ్లను తీసుకొస్తున్నారు. వీటికి సంబంధించిన పక్కా పనులు ఎప్పుడో పూర్తి అయ్యాయని చెబుతున్నారు.

తాజాగా ఈ నాలుగు ఛానళ్లను ఆగస్టు 27న స్టార్ట్ చేస్తారని చెబుతున్నారు. ఇక.. కొత్త రానున్న నాలుగు ఛానళ్ల విషయానికి వస్తే.. 1. ఈటీవీ ప్లస్ (కామెడీకి పెద్ద పీట వేస్తారు).. 2.ఈటీవీ లైఫ్ (కుటుంబ సంబంధిత అంశాలకు ప్రాధాన్యం.. ఆరోగ్యం) .. 3. ఈటీవీ సినిమా (పూర్తిగా సినిమా అంశాలు).. 4. ఈటీవీ అభిరుచి (వంటావార్పు.. తదితర అంశాలు) ఉంటాయని చెబుతున్నారు. అన్నీ అందరిని ఆకర్షించే అంశాలు కావటంతో.. ఈ నాలుగు ఛానళ్లు తెలుగువారి మనసు దోచుకోవటం ఖాయమని చెబుతున్నారు. సో.. మీడియా మొఘల్ మరోసారి తానేంటో కొత్త ఛానళ్లతో చూపించనున్నారన్న మాట.