Begin typing your search above and press return to search.

బాబా రాందేవ్ పై చర్యలకి డిమాండ్ ... ‘బ్లాక్ డే’ కి పిలుపునిచ్చిన వైద్యులు !

By:  Tupaki Desk   |   1 Jun 2021 5:39 AM GMT
బాబా రాందేవ్ పై చర్యలకి డిమాండ్ ... ‘బ్లాక్ డే’ కి పిలుపునిచ్చిన వైద్యులు !
X
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ గత కొన్ని రోజులుగా చేస్తోన్న వ్యాఖ్యలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా అల్లోపతి వైద్యులు బ్లాక్ డే పాటించాలని పిలుపునిచ్చారు. అయితే, దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఈ నిరసనల వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ ఓ ఆర్‌ డీఏ) తెలిపింది. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ అవమానకర, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ పిలుపు ఇచ్చినట్టు ఫెడరేషన్ ఇప్పటికే తెలిపింది.

ఓ వ్యాపారవేత్తగా ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునే ఉద్దేశంతోనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా బాబా రాందేవ్ ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని ఐఎంఏ మండిపడింది. అల్లోపతి వైద్యంపైనా, కరోనా వ్యాక్సిన్ల పైనా బాబా రాందేవ్ గత వారం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బాబా రాందేవ్ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్రానికి 14 పేజీల ఫిర్యాదును కేంద్రానికి పంపింది. కాగా, రాందేవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లోపతిని స్టుపిడ్ సైన్స్ గా కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలపైనే ఇవాళ నిరసన చేపట్టారు. బాబా రాందేవ్ అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయగా, రాందేవ్ బాబా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. అయితే , ఆ తర్వాత అయన అల్లోపతి వైద్యం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.