విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే

Mon Oct 18 2021 22:00:01 GMT+0530 (IST)

Ramdas Athawale Comments On Vizag Steel Plant

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను.. వేస్తున్న అడుగులను తప్పుబట్టే సాహసం.. దాదాపు ఎవరూ చేయడం లేదు. ఎంత బాధ ఉన్నా.. తాము ఎంతగా నష్టపోతామని అనుకుంటున్నా.. మౌనంగా ఉంటున్నారే తప్ప.. ఎవరూ నోరు విప్పి.. మీరు చేస్తున్నది తప్పు! అని చెప్పే సాహసం చేయడం లేదు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. తాము మోడీని వ్యతిరేకిస్తే.. ఏం కొంపలు మునుగుతాయో.. ఎక్కడ తమకు నిధులు ఆపేస్తారో.. సీబీఐని దించేస్తారో.. ఈడీని పరుగులు పెట్టిస్తారో.. అనుకుంటున్నారు.. దీంతో మోడీ తన దూకుడును కొనసాగిస్తున్నారు. అదేసమయంలో ప్రభుత్వ రంగ సంస్థలను పప్పుబెల్లాల్లా అమ్మేస్తున్నారు.మరీ ముఖ్యంగా ఏపీలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయానికి మోడీ సర్కారు రెడీ అయింది. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని ఆందోళనలు చేసినా.. వెనక్కి తగ్గేది లేదని చెప్పుకొస్తోంది. ఏపీ ప్రభుత్వం పైకి వ్యతిరేకిస్తున్నా.. అంతర్గతంగా కేంద్రంతో మాత్రం విభేదించి.. గట్టిగా పోరాడే పరిస్థితిని తీసుకురాలేక పోతోంది. 28 మంది ఎంపీలు(లోక్‌సభ రాజ్యసభ కలిపి) ఉన్నా.. ఏ ఒక్కరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గళం వినిపించలేకపోతున్నారు. ఇక రాష్ట్రానికే చెందిన బీజేపీ నాయకులు కూడా విశాఖ ఉక్కును అమ్మేస్తున్నా.. నోరు విప్పడం లేదు. పైగా.. ఇది `మన మంచికే` అంటూ..పురందేశ్వరి వంటివారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ అనూహ్యంగా కేంద్రంలో మంత్రిగా ఉన్న రామ్‌దాస్ అథావలే మాత్రం విశాఖ ఉక్కుపై మనసు చంపుకోకుండా మాట్లాడారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం తెగ ఉవ్విళ్ళూరుతున్న సమయంలో కేంద్ర క్యాబినేట్ మంత్రిగా ఉన్న రామ్ దాస్ అథవాలే ఈ పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడం తప్పే నని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించిన ఆయన.. విశాఖ ఉక్కుపై సంచలన కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వం(తను మంత్రి గా ఉన్న ప్రభుత్వం) తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవెట్ పరం చేస్తే ఎస్సీ ఎస్టీలకు రిజవేషన్లతో పాటు ఎన్నో అవకాశాలు పూర్తిగా పోతాయని అథావలే ఆందోళన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఇది.. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారడం గమనార్హం.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు ధారదత్తం చేస్తే.. ఉపాధి అవకాశాలు బడుగులకు దక్కవని అథావలే అభిప్రాయపడ్డారు. అంటే ఉక్కు ప్రైవేట్ పై దూకుడు కొందరు కేంద్ర మంత్రులకు అసలు సహించలేని విషయంగా ఉందని అర్ధమవుతోంది. అయితే రామ్ దాస్ అథవాలే దీని మీద మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో ఉక్కు వంటివి వెళ్లినా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూస్తామని హామీ మాత్రం ఇచ్చారు. మొత్తానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఇన్నాళ్ళూ విపక్షాల నుంచి అది కూడా ఒకటి రెండు పార్టీల నుంచి కామెంట్లు వినిపించినా.. ఇపుడు ఏకంగా కేంద్ర మంత్రి ఈ జాబితాలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే.. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. అథావలే.. బీజేపీ నాయకుడు కాదు. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు. అంటే.. సొంతపార్టీ ఉంది. మహారాష్ట్ర కు చెందిన అథావలే.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ పార్టీ.. బీజేపీకి మద్దతిస్తోంది. అంటే..ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉంది. మరి ఈ నేపథ్యంలో అథావలే చేసిన కామెంట్లను బీజేపీ నేతలు ఎలా చూస్తారో చూడాలి.