రమణ రమణ... జగన్ ఆశ నిరాశ చేశారే...

Wed Sep 28 2022 14:22:29 GMT+0530 (India Standard Time)

Ramana Ramana... Jagan's hope is disappointing...

ఆయన జగన్ మీద బారెడు ఆశ పెట్టుకున్నారు. కానీ కనీసంగా అది తీరడంలేదు. దాంతో నిరుత్సాహంతో నిండా మునిగిపోయారు. ఆయనే  తిరుమలలో ఒకనాడు వెలిగిన రమణ దీక్షితులు. ఆయన జగన్ తిరుపతి టూర్ సందర్భంగా తన ఆశలు అడియాశలు అయ్యాయని ట్విట్టర్ ద్వారా గట్టిగా చాటారు. జగన్ నుంచి ఆశావహమైన ప్రకటన వస్తుందని భావించినా చివరికి ఏమీ లేదని కూడా బాధపడ్డారు.ఇంతకీ రమణ దీక్షితులు ఆశ ఏంటి జగన్ ఎందుకు ఆయన్ని నిరుత్సాహపరచారు అంటే కధ చాలానే ఉంది. ఇదే రమణదీక్షితులు తిరుపతిలో ఒకనాడు ఒక రేంజిలో చక్రం తిప్పారు. అయితే ఆనాడు ఆయన పింక్ డైమండ్ స్వామివారిది పోయింది అంటూ చేసిన ప్రచారంతో నాటి టీడీపీ సర్కార్ కి గుస్సా వచ్చి ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చేసి తప్పించేసింది.

నాడు రమణదీక్షితులు ఢిల్లీ చెన్నై హైదరాబాద్ బెంగుళూరు వంటి చోట్ల  ప్రెస్ మీట్లు పెట్టారు. అలా ఆధ్యాత్మిక దీక్షితులు కాస్తా రాజకీయ ప్రకటనలు చేయడంతో టీడీపీకి చేదు అయ్యారు. వైసీపీకి ముద్దు అయ్యారు. నాడు ఆయన జగన్ని కలిస్తే తాను అధికారంలోకి వస్తే తిరిగి ఆయనకు పోస్ట్ ఇప్పిస్తాను అని హామీ ఇచ్చారు. దాంతో ప్రధాన అర్చకుడుగా మళ్లీ వెలగాలనుకున్న రమణ దీక్షితుల వారి ఆశలు గత మూడేళ్ళుగా అలా వాడిపోతున్నాయి తప్ప జగన్ నుంచి హామీ నెరవేర్చే కార్యక్రమం అయితే ఏదీ జరగలేదుట.

ఇక టీటీడీలో రమణ దీక్షితులు పదవి కోసం అక్కడ నిబంధనల మీద అధ్యయనం చేయడానికి వన్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా వైసీపీ సర్కార్ అప్పట్లో ప్రకటించింది కానీ అది ఏ మేరకు పనిచేసిందో ఏ నివేదిక ఇచ్చిందో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. రమణ దీక్షితులు ఇదే అంశం మీద వైసీపీ పెద్దలను కలసిన ప్రతీ సారి ఒక జీవో అయితే ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ ఏదీ వర్కౌట్ అవడంలేదు రమణ దీక్షితులు మాత్రం ప్రధాన అర్చకుడు కాలేకపోతున్నారు.

ఇదిలా ఉటే తాజాగా జగన్ తిరుపతి టూర్ లో రమణ దీక్షితులకు ఎలాంటి పిలుపు రాలేదు ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన్ని పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో బాధపడిన రమణ దీక్షితులు జగన్ తిరుపతి టూర్ లో వన్ మ్యాన్ కమిటీ నివేదిక గురించో మరో దాని గురించో ఏదో ఒకటి చెబుతారనుకుంటే అది జరగలేదు.  ఇవన్నీ చూసిన రమణ దీక్షితులు జగన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అడియాశలు అయ్యాయని వాపోయారు.

అయినా ఏం చేస్తారాయన. స్వామి వారి సేవలో ఉండాల్సిన రమణ దీక్షితులు నాడు పింక్ డైమండ్ ఇష్యూ అంటూ రాజేయడమే అసలు సమస్యలు కారణం అని అంటున్న వారూ ఉన్నారు. నిజానికి అది మిస్ అయిందా  లేదా అన్నది కూడా తెలియదు. ఏమైనా చూస్తే రమణ దీక్షితులు నాడు హద్దులు దాటడం వల్లనే నేడు ఇలా ఏమీ కాకుండా అయిపోయారని జగన్ అడియాశ చేశారని ఆఖరుకు గ్రహించారని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.