మరోసారి వార్తల్లోకి రామసేతు.. ఈసారి ఇలా!

Thu Oct 06 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Ram Sethu in the news once again

తేత్రాయుగంలో సీతమ్మ అమ్మవారిని రావణాసురుడు అపహరించి శ్రీలంకలో బంధించాడనే సంగతి తెలిసిందే. ఆమెను తీసుకురావడానికి శ్రీరాముడు తమిళనాడులోని ధనుష్కోడి ప్రాంతం నుంచి శ్రీలంక వరకు వంతెన నిర్మించాడని పురాణాలు తెలుపుతున్నాయి. దీన్ని రామసేతుగా పిలుస్తున్నారు. ఆ వంతెనను వానరుల సహాయంతో శ్రీరాముడు నిర్మించాడు. అందులో వేసిన రాళ్లు మునిగిపోకుండా ఆ రాళ్లపై శ్రీరామ అని రాశారని.. దీంతో ఆ రాళ్లు సముద్రంలో మునిగిపోకుండా నీటిపై తేలాయని అందరూ నమ్ముతున్నదే.రామసేతు తేత్రాయుగంగా చెప్పబడుతున్న కాలంలోనే నిర్మించారని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా సైతం ధ్రువీకరించింది. రామ సేతు సహజసిద్ధంగా ఏర్పడిందనే హేతువాదుల వాదనలు తప్పని వెల్లడైంది. అలాగే సైన్స్ ఛానెల్‌లోని "ఏన్షియంట్ లాండ్ బ్రిడ్జ్" షోలో పలువురు పరిశోధకులు భారతదేశం- శ్రీలంక మధ్య 50 కిలోమీటర్ల పొడవున రాళ్లతో వంతెన నిర్మించారని వెల్లడించారు. ఆ రాళ్ళు ఏడు వేల సంవత్సరాల పురాతనమైనవని పేర్కొన్నారు.

భారతదేశంలోని పంబన్ ద్వీపం నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు విస్తరించి ఉన్న వంతెన మానవ నిర్మితమని పలు నివేదికలు కూడా తెలియజేస్తున్నాయి. రామసేతు 18400 ఏళ్ల క్రితం నాటిదని అన్నా యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీలు చేసిన సంయుక్త పరిశోధనల్లో తేలింది. రామేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా జీఎస్‌ఐ చేసిన అధ్యయనంలో ఇది 7 వేల నుంచి 18 వేల సంవత్సరాల నాటిదని స్పష్టమైంది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో దాదాపు 48 కిలోమీటర్ల మేర ఈ వంతెన ఉందని వెల్లడయ్యింది.

అలాంటి ఈ రామసేతుపై ఇప్పుడు మరో వివాదం రేగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ లో రామసేతు ప్రస్తావన ఉందని అంటున్నారు. ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలపై ఇప్పటికే రాజకీయ నాయకులతోపాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ముస్లిం మతంలో కూడా రామసేతులో పలు వాదనలు ఉన్నాయి. ముస్లిం మతానికి చెందిన కొందరు నిపుణులు ఈ వంతెనను ఆడమ్ నిర్మించాడని చెబుతారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆడమ్ ఈ వంతెనను ఆడమ్ శిఖరాన్ని చేరుకోవడానికి ఉపయోగించాడని అంటున్నారు.

ఇప్పుడు ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్‌లో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నాడు. ఇందులో రామసేతు ప్రస్తావన ఉండటం.. ఇప్పటికే బయటకు వచ్చిన సన్నివేశాల్లో రామసేతు గురించి కూడా ఉన్న నేపథ్యంలో ఏమాత్రం తేడాగా ఉన్న ఈ సినిమా చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.