Begin typing your search above and press return to search.

జగన్ కృప : ఆమెకు రాజ్యసభ ...?

By:  Tupaki Desk   |   12 May 2022 3:30 PM GMT
జగన్ కృప :  ఆమెకు రాజ్యసభ ...?
X
మొత్తానికి ఆమె అనుకున్నట్లే జరుగుతోంది. ఆమెకు జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇపుడు రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు. ఆమె ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయిన నేపధ్యంలో కృపారాణికి సీటు కన్ ఫర్మ్ అన్న సమాచారం బయటకు వచ్చింది.

ఈ పేరుని కొద్ది రోజుల క్రితమే జగన్ ఓకే చేసి ఉంచారని అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు ఒక సీటు ఈసారి ఇస్తారని మొదటి నుంచి అనుకుంటున్నదే. అందునా బీసీ మహిళగా విద్యాధికురాలిగా ఉన్న కృపారాణికి ఎంపీ పదవి ఖాయమని కూడా ముందే ఊహించారు. అయితే మధ్యలో అనేక సమీకరణలు మారాయి. దాంతో కిల్లికి కష్టమే అని ఒక దశలో అనుకున్నారు.

దాంతో ఆమె తాడేపల్లి వెళ్ళి మరీ జగన్ని కలసి వచ్చారు. అయితే ఆల్ ద బెస్ట్ కృపమ్మా అని నాడు జగన్ బ్లెస్ చేశారు. ఇక నాటి నుంచి ఆమె కొంత నిబ్బరంగా ఉన్నారు. ఇపుడు అదే నిజం అయింది. శ్రీకాకుళం జిల్లాలోని బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కృపారాణి 2009లో ఫస్ట్ టైమ్ శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె నాడు దివంగత కింజరాపు ఎర్రన్నాయుడుని ఓడించి రికార్డులకు ఎక్కారు.

మరో వైపు చూస్తే వైసీపీ నుంచి నలుగురికి ఈసారి రాజ్యసభకు వెళ్ళే చాన్స్ ఉంటుంది. అందులో విజయసాయిరెడ్డిని మరో మారు రెన్యూవల్ చేస్తారు అని అంటున్నారు. ఇక మరో సీటుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ కుటుంబానికి ఇస్తున్నారు. మిగిలిన రెండు సీట్లు బీసీలకే కేటాయించారు. అందులో ఒకటి కిల్లి కృపారాణికి బీసీ, మహిళా కోటా కింద ఇవ్వనున్నారు. ఇక మరో సీటుని నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావుకు కేటాయించారని విశ్వసనీయ సమాచారం. మొత్తానికి చూస్తే జగన్ అన్నీ రెడీ చేసి పెట్టేశారు.

గత సారి అంటే 2020లో జరిగిన రాజ్యసభ సీట్ల ఎంపికలో కూడా ఇద్దరు బీసీలకు చాన్స్ ఇచ్చిన జగన్ ఈసారి మరో ఇద్దరికి సీట్లు ఇచ్చి బీసీ ముద్రను పార్టీ మీద బలంగా వేయనున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ తరఫున ఉండే రాజ్యసభ సభ్యులలో ఇప్పటిదాకా మహిళ ఎవరూ లేరు. ఫస్ట్ టైమ్ కిల్లి కృపారాణికి ఆ ఖ్యాతి దక్కబోతోంది.