రాజ్యసభ రేసులో అనూహ్యంగా ఆమె పేరు... ?

Wed Jan 26 2022 23:00:01 GMT+0530 (IST)

Rajya Sabha Seat For Killi Kurparani

రాజ్యసభ సీట్లు నాలుగు త్వరలో ఖాళీ అవుతున్నాయి. ఏపీ వరకూ చూసుకుంటే ఆ సీట్లు అన్నీ కూడా వైసీపీకే దక్కుతాయి. ఫుల్ మెజారిటీ అసెంబ్లీలో ఉండడంతో ఆ పార్టీ వారే పెద్దల సభకు నెగ్గుతారు. దాంతో వైసీపీలో పోటీ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక వైసీపీకి ఈ టెర్మ్ లో వచ్చిన చివరి అవకాశంగా కూడా నేతలు చూస్తున్నారు. దీని తరువాత  మరో రెండేళ్లకు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అంటే అది 2024 జూన్ నెలలో అన్న మాట. అప్పటికి ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఒకవేళ వైసీపీ మళ్ళీ గెలిచినా ఇంత మెజారిటీ వస్తుంది టోటల్ సీట్లు ఆ పార్టీవే అవుతాయన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు.దాంతో రాజ్యసభ సీట్ల కోసం ఈసారి బాగానే పోటీ ఉంది అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రాలో చూసుకుంటే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి ఈ సీటు విషయంలో హామీ ఉందని ప్రచారం సాగుతోంది. ఆమె ఈ పదవికి అర్హురాలు అని కూడా ఆమె అనుచరులు అంటున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె కనుక పెద్దల సభలో ఉంటే వైసీపీకి మంచి హ్యాండ్ ఉన్నట్లు అవుతుందని కూడా వాదిస్తున్నారు.

అయితే ఇపుడు అదే శ్రీకాకుళం జిల్లా నుంచి మరో పేరు బయటకు వచ్చింది. ఆమె ఎవరో కాదు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఆమెను రాజ్యసభకు ఎంపిక చేస్తారు అని అంటున్నారు. నిజానికి ఈ ప్రచారం అంత నమ్మదగినదిగా లేకపోయినా రాజకీయాల్లో ఏదీ కాదూ కూడదు అని ఉండదని అంటున్నారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన రెడ్డి శాంతిది రాజకీయ కుటుంబం.

ఆమెకు మరో రెండేళ్ల పాటు ఎమ్మెల్యే పదవి ఉంది. అయితే మధ్యలోనే ఆమె చేత రాజీనామా చేయించి రాజ్యసభకు పంపుతారా అంటే ఆమె కుటుంబం మీద వైసీపీ అగ్రనాయకత్వానికి ఉన్న అభిమానంతో చేసినా చేయవచ్చు అంటున్నారు. పాతపట్నంలో వైసీపీ పరిస్థితి బాగాలేదు ఎన్నికలు ఎపుడు జరిగినా కూడా అక్కడ ఆ పార్టీ ఓడడం ఖాయమని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఆ మధ్య జరిగిన  హీరమండలం జెడ్పీటీసీ పదవికి పోటీ చేసిన రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్ ఓడిపోవడంతో టీడీపీకి అక్కడ ఉన్న పట్టు తెలుస్తోంది అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె కుటుంబానికి ఒక అధికార  పదవి ఉండాలన్న లెక్కలతో పాటు సామాజిక లెక్కలను బేరీజు వేసుకుని మరీ ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారని అంటున్నారు. అయితే ఆమెకు టికెట్ ఎటూ ఇవ్వరని కిల్లి కృపారాణి అవకాశాలను దెబ్బతీయడానికి మధ్యలో ఆమె పేరును జిల్లాకు చెందిన కొందరు వైసీపీ ప్రముఖులు  తీసుకువచ్చారని చెబుతున్నారు.  మొత్తానికి చూస్తే ఈ గందరగోళం మధ్యన  శ్రీకాకుళం జిల్లాలో ఎవరికీ రాజ్యసభ చాన్స్ లేదని కూడా మరో మాట వినిపిస్తోంది.

ఇంకో వైపు చూస్తే ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ నేత ఒకరిని పెద్దల సభకు పంపడం ద్వారా ఆ సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునే వ్యూహం ఉందని అంటున్నారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా రాజ్యసభ అవకాశాలు కొట్టి పారేయలేమని కూడా చెబుతున్నారు. అయితే రెండేళ్లలో ఎన్నికలు ఉంచుకుని  ఇపుడు అలాంటి రాజకీయ  ప్రయోగాలు ఏవీ వైసీపీ చేయదని ఉత్తరాంధ్రాకు సంబంధించి ప్రస్తుత ఎంపీ విజయసాయిరెడ్డి పేరు కన్ఫర్మ్ అయిందని మిగిలిన సీట్లను ఇతర జిల్లాల వారికే ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.