రజనీ - కమల్... మాటలు ఓకే చేతలెప్పుడండీ?

Wed Nov 20 2019 07:00:02 GMT+0530 (IST)

Rajinikanth and Kamal haasan In Tamilnadu Politics

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఓ కొత్త అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. సుదీర్ఘ కాలంగా సినిమాల్లో కొనసాగుతూ అగ్ర నటులుగా ఉన్న ప్రముఖ నటులు రజనీకాంత్ కమల్ హాసన్ లు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశారు. అయితే పోటీకి మాత్రం వారిద్దరూ అప్పుడూ ఇప్పుడంటూ ప్రకటనలు గుప్పిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు తప్పించి... ఆ ప్రకటనలను కార్యరూపంలోకి తీసుకొచ్చే విషయంపై మాత్రం దృష్టి సారించడం లేదు. రాజకీయంగా ఇప్పటికే వేర్వేరు దారుల్లో నడుస్తున్న ఈ నటులు... ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చేస్తామంటూ చెబుతున్నారు. ఈ ప్రకటనలు తమిళ తంబీల్లో ఉత్సాహం రేకెత్తిస్తున్నా... వారి రాజకీయ ప్రస్థానం మాదిరే ఈ ప్రకటనలు కూడా ఉత్తిత్తేవేనా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.తామిద్దరం కలిస్తే... తమిళ రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదవడం ఖాయమేనని కమల్ హాసన్ సంచలన ప్రకటన ఒకటి చేశారు.  రజనీకాంత్ తమతో కలిసివస్తే తమిళనాడు ప్రజలకు అద్భుతమైన రీతిలో సంక్షేమం సాధ్యపడుతుందని కమల్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తామిద్దరిది 40 ఏళ్ల అనుబంధమని తామిద్దరం కలిస్తే... తాము ఏ ఉద్దేశంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో అది తప్పక సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో రజనీ తనతో కలిసి రావాలని కమల్ స్వయంగానే పిలుపు ఇచ్చినట్టేనని చెప్పక తప్పదు.

కమల్ చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు రజనీ వద్ద ప్రస్తావించారు. కమల్ తో కలిసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని కూడా రజనీ సూటిగానే సమాధానం ఇచ్చేశారు. తన వ్యాఖ్యలపై రజనీ సానుకూలంగా స్పందించిన విషయాన్ని తెలుసుకున్న కమల్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కొద్ది గంటల వ్యవధిలోనే వీరిద్దరి నుంచి ఈ తరహా ప్రకటనలు రావడంతో తమిళనాట ఓ కొత్త తరహా చర్చకు తెర తీశాయి. మరి వేర్వేరు దారుల్లో వీరిద్దరి రాజకీయ ప్రస్థానం మాదిరే.. ఈ ప్రకటనలు కూడా ఒట్టి మాటలుగానే మిగులుతాయా? లేదంటే... కార్యరూపం దాల్చి తమిళ రాజకీయాల్లో మరో చరిత్రను లిఖిస్తాయో చూడాలి.