తలైవా సంచలనం.. తంబీల తీర్పు మహా అద్భుతమేనట

Fri Nov 22 2019 09:25:46 GMT+0530 (IST)

Rajini Kanth Sensational Comments In Tamilnadu About Politics

మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయం అప్పుడే రంజుగా మారిపోయింది. ఓ వైపు విశ్వ నటుడు కమల్ హాసన్ మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస ప్రకటనలతో నిజంగానే ఇప్పుడు అక్కడ రాజకీయం హీటెక్కిపోయింది. ఇప్పటికే రాజకీయాల్లోకి కమల్ ఎంట్రీ ఇచ్చేస్తే... త్వరలోనే అంటూ చెబుతూ వస్తున్న రజనీ కూడా రాజకీయ తెరంగేట్రం కోసం రెడీ అయిపోతున్నారు. ఇలాంటి తరుణంలో రజనీ నోట నుంచి గురువారం వెలువడిన ఓ సంచలన కామెంట్ వాతావరణాన్ని మరింత హీటెక్కించిందనే చెప్పాలి.2021లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మహా అద్బుతమైన తీర్పు ఇవ్వనున్నారని దానికి తనదే పూచీ అంటూ రజనీ సంచలన కామెంట్ చేశారు. మక్కల్ నీది మయ్యమ్ పేరిట ఇప్పటికే రాజకీయ పార్టీ పెట్టేసిన కమల్ హాసన్ తో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు కూడా రజనీ ఆసక్తికర సమాధానమే ఇచ్చారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని రజనీ చెప్పారు. కమల్ తో పొత్తు లేదని మాత్రం రజనీ చెప్పకపోవడం గమనార్హం.

తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే... రజనీతో కలిసి నడిచేందుకు సిద్ధమని కమల్ చేసిన ప్రకటన దానికి తనకు కూడా అభ్యంతరం ఏమీ లేదని రజనీ చెప్పిన నేపథ్యంలో గురువారం మీడియా ప్రతినిధులు రజనీ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా రజనీ మీడియాతో మాట్లాడుతూ 2021లో తమిళనాడు ప్రజలు మహా అద్భుతమైన తీర్పును ఇవ్వనున్నారని ఆ అద్భుతం ఏమిటో ఇప్పుడే చెబితే అది అద్భుతం ఎలా అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రజలు ఇచ్చే అద్భుత తీర్పునకు తనదే పూచీ అని కూడా రజనీ మరింత ఆసక్తికర కామెంట్ చేశారు.