Begin typing your search above and press return to search.

రాజ‌స్థాన్ టూ స్విట్జ‌ర్లాండ్.. అదృష్టం అంటే ఈ ఆటోడ్రైవ‌ర్ దే!

By:  Tupaki Desk   |   15 Jun 2021 8:30 AM GMT
రాజ‌స్థాన్ టూ స్విట్జ‌ర్లాండ్.. అదృష్టం అంటే ఈ ఆటోడ్రైవ‌ర్ దే!
X
అది రాజ‌స్థాన్‌. ఆ ప్రాంతానికి చెందిన యువ‌కుడు రంజిత్ సింగ్‌. ఆర్థిక ప‌రిస్థితి స‌రిగాలేక పెద్ద‌గా చ‌దువుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. టెన్త్ ఫెయిల్‌. ఇంటి బాధ్య‌త‌లు భుజానికెత్తుకొని 16 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే ఆటో డ్రైవ‌ర్ గా మారిపోయాడు. జైపూర్ కు వ‌చ్చే విదేశీ ప‌ర్యాట‌కుల‌కు చాలా మంది ఆటోడ్రైవ‌ర్లు గైడ్ గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఆ విధంగా రంజిత్ సింగ్ సైతం ఓ గైడ్ అయ్యాడు.

ఇలా రోజులు సాగిపోతుండ‌గా.. ఓ రోజు ఫ్రాన్స్ నుంచి భార‌త్ లో విమానం ల్యాండ్ అయ్యింది. అందులోంచి మ‌నోడి జీవితాన్ని మార్చ‌బోయే అమ్మాయి కూడా దిగింది. జైపూర్ చూడ‌టానికి వ‌చ్చింది. ఆమెకు రంజిత్ సింగ్ గైడ్ గా వ్య‌వ‌హ‌రించాడు. అన్ని ప్రాంతాలూ చూపించాడు. మ‌నోడి మాట తీరు.. ప‌ద్ధ‌తి అన్నీ న‌చ్చ‌డంతో ప్రేమ‌లో ప‌డిపోయింది. ఆ విధంగా ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ల‌వ్ చేసుకున్నారు.

స‌ద‌రు యువ‌తి ఫ్రాన్స్ వెళ్లిన త‌ర్వాత కూడా రంజిత్ ను మ‌రిచిపోలేదు. ఆ విధంగా త‌మ‌ది ఆక‌ర్ష‌ణ కాదు.. ప్రేమ అని ఫిక్స్ అయిపోయారు. వెంట‌నే ఆమెను క‌ల‌వ‌డానికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కానీ.. వీసా దొర‌క‌లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా రిజెక్ట్ అయ్యింది. దీంతో.. మ‌రోసారి ఇత‌ని అదృష్ట దేవ‌త ఫ్రాన్స్ నుంచి బ‌య‌ల్దేరి వ‌చ్చింది. వీసా ప్రాబ్ల‌మ్ క్లియ‌ర్ చేసుకొని త‌న వెంట తీసుకెళ్లింది. ఆ విధంగా వీళ్లిద్ద‌రూ 2014లో పెళ్లి చేసుకున్నారు.

అయితే.. అక్క‌డి ఆహారం రంజిత్ కు స‌రిప‌డ‌లేదు. దీంతో.. ఇండియ‌న్ వంట‌కాల‌ను సొంతంగా చేసుకోవ‌డం మొద‌లు పెట్టాడు. కేవ‌లం చేసుకొని తిన‌డం కాకుండా.. వీడియోలు తీసి, యూట్యూబ్ లో పెట్ట‌డం మొద‌లు పెట్టాడు. త‌క్కువ కాలంలోనే ఇత‌ని ఛాన‌ల్ ఫేమ‌స్ అయిపోయింది. ప్ర‌స్తుతం ఈ జంట స్విట్జ‌ర్లాండ్ లో స్థిర‌ప‌డింది. వీళ్ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా. త్వ‌ర‌లో అక్క‌డ ఓ ఇండియ‌న్ రెస్టారెంట్ ఓపెన్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

అదృష్టం అనేది నిజంగా ఉంటుందా? ఈ ప్ర‌శ్న‌కు ఎవ‌రి స‌మాధానం వారు చెబుతారు. కానీ.. ఇలాంటివి చూసిన‌ప్పుడు మాత్రం నిజ‌మేన‌ని అనిపిస్తూ ఉంటుంది. ఎక్క‌డి రాజ‌స్థాన్‌.. ఎక్క‌డ ఫ్రాన్స్.. ఇంకెక్క‌డ స్విట్జ‌ర్లాండ్‌?? ఎక్క‌డి ఆటో.. ఎక్క‌డి విమానం??