జగన్ సర్కారు పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Sun Feb 28 2021 19:00:01 GMT+0530 (IST)

Rajasingh sensational remarks on the Jagan government

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ ధర్మానికి.. హిందూ ఆలయలపై జరుగుతున్న దాడులపై ఆయన స్పందించారు. ఒక ప్రముఖ మీడియా చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలోని దేవాలయాలపై ఎన్నో దాడులు జరుగుతున్నా ఏపీ బీజేపీ అక్కడ ఎందుకు సైలెంట్ గా ఉంటోందన్న ప్రశ్నకు స్పందించిన రాజాసింగ్ ఏమన్నారంటే.ఏపీ బీజేపీ నేతలు.. అక్కడి అధికారుల మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో తనకు తెలీదన్నారు. తనకొక వీడియో వచ్చిందని.. అందులో కడప నుంచి అక్రమంగా ఆవులను రాత్రిపూట వాహనాల్లో తరలిస్తున్నవైనం అందులో ఉందన్నారు. ఏపీలో బీజేపీ కార్యకర్తలపై టార్చర్ ఎక్కువగా ఉందన్న రాజాసింగ్.. మత మార్పిడులపై తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే హిందువులకు నష్టమన్న ఆయన.. వైఎస్ కానీ జగన్ కానీ హిందువులకు చేసిన డ్యామేజ్ ఎంతన్నది చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు.

ఏపీలోని ఊళ్లకు ఊళ్లు మతమార్పిళ్లు జరిగాయని.. గోరక్షణ చేసే వారిని అరెస్టు చేస్తున్నారన్నారు. అక్రమంగా గోవుల్ని తెలంగాణకు తరలిస్తున్నారన్నారు. ఆవు మాంసాన్ని కూడా తరలిస్తున్నట్లుగా ఆరోపించారు. మరి ఇంత జరుగుతున్నా ఏపీ బీజేపీ దూకుడుగా ఎందుకు ముందుకు వెళ్లటం లేదన్నది తనకు తెలీదన్నారు. పార్టీ ఆదేశిస్తే.. యావత్ భారతదేశం మొత్తం తాను గోరక్షణ చేస్తానని చెప్పిన ఆయన.. పార్టీ ఆదేశం లేకుండా తానేమీ చేయలేనని చెప్పారు.

హిందూ ధర్మాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీస్తుందన్న ఆరోపణ వంద శాతం నిజమన్న రాజాసింగ్.. ''ఎన్నో గుళ్ల పైన దాడి చేస్తే.. ఎంతమందిని అరెస్టు చేశారు. ఒక్క పాస్టర్ ప్లాన్ చేసి గుళ్లపైన దాడులు చేయించినా.. కేసును ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు?'' అని ప్రశ్నించారు. సదరు ఫాస్టర్ వెనుక ఎంతమంది ఉన్నారు? అతనికి ఫండింగ్ చేస్తున్నదెవరు? ఎన్ని గుళ్లను ధ్వంసం చేశారన్న వివరాలు వెల్లడించాల్సిన బాధ్యత ఏపీ సర్కారు మీద ఉందని.. ఇప్పటివరకు బయటపెట్టటం లేదన్నారు.