గులాబీ కారు ఎక్కాలంటే రాజగోపాల్ రెడ్డి ఆ కండీషన్ పెట్టారట

Sun Aug 14 2022 14:03:52 GMT+0530 (IST)

RajaGopal Reddy Condition For TRS

మునుగోడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయటంతోపాటు.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పటం తెలిసిందే. పార్టీ మారినప్పుడు.. ఆ పార్టీ కారణంగా వచ్చిన పదవిని వదిలేయాలన్న సిద్దాంతాన్ని తూచా తప్పకుండా పాటించి.. నైతికత విషయంలో తనను వేలెత్తి చూపించలేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఆయన రాజీనామాతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం రాజుకోవటేమ కాదు.. ఇప్పుడుఅన్ని పార్టీలకు ఆయనో పెద్ద పరీక్షను పెట్టారు. ఆయనకు ఆయనగా పరీక్షకు దిగటం ఒక ఎత్తు అయితే.. ఆయన కారణంగా ఇప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్.. కాంగ్రెస్.. బీజేపీలకు ఇప్పుడు చావో రేవో అన్న పరిస్థితిని తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. త్వరలోజరగబోయే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద తమకున్న ఫస్ట్రేషన్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్నుదెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ చేరేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినట్లుగా పేర్కొన్నారు.

పార్టీలో చేరే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ 300 సార్లు తిరిగినట్లు చెప్పిన మంత్రి జగదీశ్ రెడ్డి.. 'నడిబజారులో అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరుల ఆటలు సాగవు. టీఆర్ఎస్ లోకి వస్తా.. కాంట్రాక్టులు ఇవ్వాలని అడిగిన దొంగ రాజగోపాల్ రెడ్డి' అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు.

బీజేపీలోకి చేరిన రాజగోపాల్ రెడ్డి రూ.21వేల కోట్ల కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయినట్లుగా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతుందన్న ఆయన.. 'దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్లుగా కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతూ బకాయింపు ఎందుకు?' అని ప్రశ్నించారు.

పెట్రోల్.. డీజిల్.. నిత్యవసరాలు.. గ్యాస్ ధరల్ని పెంచిన పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి ఎందుకు పోతున్నాడు? అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక దొంగలు.. ద్రోహులు..పైరవీ కారులకు.. ప్రజా చైతన్యానికి మధ్య జరుగుతోందన్నారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మీద లోడెడ్ గన్ మాదిరి నిప్పులు చెరిగిన జగదీశ్ రెడ్డి మాటలు ఇప్పడు ఆసక్తికరంగా మారాయి.