నాపాటనే పాకిస్తాన్ కాపీ కొట్టింది

Mon Apr 15 2019 14:13:46 GMT+0530 (IST)

Raja Singh On About Pakistan Allegations

తమ పాటను కాపీ చేసి మార్చి ఆలపించాడని తెలంగాణలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పాకిస్తాన్ ఆర్మీ మేజర్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.. దీనిపై తాజాగా రాజాసింగ్ వివరణ ఇచ్చాడు. తాను పాడిన పాటను పాకిస్తాన్ నుంచి కాపీ చేయలేదని.. అయినా ‘తీవ్రవాద దేశం’ నుంచి కాపీ కొట్టాల్సిన అగత్యం తమకు ఇంకా పట్టలేదని కౌంటర్ ఇచ్చాడు.రాజాసింగ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ మీడియా తన పాట హిందుస్తాన్ జిందాబాద్ మీద రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఒక తీవ్రవాద దేశం గాయకులను పాటలను కూడా రచిస్తుందని తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు. పాకిస్తాన్ గాయకులే తన పాటను కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. తాను పాకిస్తాన్ పాటను కాపీ కొట్టలేదని.. అయినా తీవ్రవాదదేశం పాకిస్తాన్ నుంచి కాపీ చేయాల్సిన అవసరం తనకు లేదు’ అని రాజాసింగ్ ట్వీట్ లో ఎండగట్టారు.

పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఆదివారం ట్విట్టర్ లో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాకిస్తాన్ ఆర్మీ పాటను కాపీ చేశాడని పోస్టు చేశారు. దీనిపై ఈరోజు సోమవారం రాజాసింగ్ కౌంటర్ ట్వీట్ చేశారు. ‘నేను ఇప్పటివరకూ ఆ పాటను వినలేదు.. పాకిస్తాన్ వాళ్లు ఈ పాటను కంపోజ్ చేసి ఉంటారని నాకు ఎలా తెలుస్తుంది.? పాకిస్తాన్ వాళ్లే నా పాటను కాపీ కొట్టి ఉండవచ్చు. ఎందుకంటే శ్రీరామ నవమికి కొన్ని నెలలకు ముందే మేం పాటను రూపొందిస్తాం’ అని చెప్పారు.

శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 12న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందూఇజం - సైనికులపై పాటపాడి దాన్ని భారత ఆర్మీకి అంకితమిచ్చాడు. అయితే పాకిస్తాన్ ఆర్మీ కోసం సహీర్ అలీ బాగ్గా కూడా ‘దిల్ కి హిమ్మత్ వాతాన్.. అప్నా జజ్బా వాతాన్.. మన్ కి సచ్చి లాగాన్ .. సీదా రాస్తా వాతాన్’ అంటూ పాడిన పాట అచ్చం రాజాసింగ్ పాటను పోలి ఉంది. పాకిస్తాన్ ఆర్మీ డే 23 సందర్భంగా పాట విడుదల చేశారు. దీంతో తరువాత పాడిన రాజాసింగ్ పాటే కాపీ అన్న రూమర్స్ చెలరగేగడంతో బీజేపీ ఎమ్మెల్యే ఇరుకునపడ్డారు.