ఈ చిట్టి వీడియో చూశాక.. వర్షంలో కారు పార్కు చేయాలంటే ఆలోచిస్తారు

Mon Jun 14 2021 08:00:02 GMT+0530 (IST)

Rain effect in Mumbai

పార్కు చేసిన ఖరీదైన కారు క్షణాల్లో మాయమైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. నిజానికి ఈ విషయాన్ని వీడియో ఆధారం కానీ లేకుంటే ఎవరూ నమ్మరంటే నమ్మరని చెప్పాలి. 26 సెకన్ల చిట్టి వీడియోను చూసిన వారంతా షాక్ తింటున్నారు. అసలేం జరిగిందంటే..ఇటీవల ముంబయిలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోతున్నాయి. దీంతో అక్కడి వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదకు పెద్ద ఎత్తున వరద నీరు పారుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలోనిఒక అపార్టు మెంటు ఆవరణలో చోటు చేసుకున్న వైనం నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

అపార్టు మెంట్ వద్ద ఒక ఖరీదైన కారును పార్కు చేశారు. బురదతో ఉన్న ఆ ప్రాంతం హటాత్తుగా గుంటలా ఏర్పడింది. ఆ వెంటనే.. కారు పక్కకు వాలిపోయి గుంతలో పడిపోయింది. అంత పెద్ద కారు క్షణాల వ్యవధిలో పూర్తిగా మునిగిపోవటమే కాదు.. అక్కడో కారు అప్పటి వరకు ఉందని నమ్మలేని పరిస్థితి. లక్కీగా ఈ కారు పక్కనే ఉన్న కార్లకు మాత్రం ఏమీ కాలేదు. ఈ ఉదంతాన్ని అక్కడే ఉన్నఒక వ్యక్తి వీడియో తీయగా.. సుభోద్ శ్రీవాత్సవ అనే వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేశాడు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.