బాబు మార్కు వరల్డ్ క్లాస్..హైకోర్టులోకీ వర్షపు నీరు

Wed Sep 18 2019 22:32:48 GMT+0530 (IST)

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని వరల్డ్ క్లాస్ నిర్మాణాలతో నింపేస్తామని - ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా మలుస్తామని ఏపీ సీఎం హోదాలో పదే పదే చెప్పిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాటలు ఎలాంటివో తెలిపే మరో ఘటన చోటుచేసుకుంది. బాబు సీఎంగా ఉండగా... అమరావతిలో తాత్కాలిక సచివాలయం - తాత్కాలిక అసెంబ్లీ కట్టగా... చిన్నపాటి వర్షానికే ఆ రెండు భవనాల్లోకి వర్షపు నీరు పోటెత్తింది. తాజాగా బాబు జమానాలోనే వెలసిన మరో తాత్కాలిక కట్టడం తాత్కాలిక హైకోర్టు భవనం కూడా అందుకు అతీతమేమీ కాదని తేలిపోయింది. రెండు - మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైకోర్టులోకి వర్షపు నీరు చేరిపోయింది. ఆ నీటికి బయటకు తోడి పోయలేక సిబ్బంది నానా తంటాలూ పడుతున్న వైనం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనంతో రాష్ట్రంలో కోస్తా - రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో అమరావతిలోనూ బుధవారం భారీ వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు నిర్మించిన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి అతలాకుతలం అయిపోతోంది. చదరపు అడుగుకి ఏకంగా రూ. 11 వేలు వెచ్చించి నిర్మించిన అమరావతిలోని టెంపరెరీ భవనాలు.. వర్షపు నీటితో నిండిపోయాయి.  వర్షపు నీరు నిన్న ఈరోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాబీల్లోకి రావటంతో.. కూలర్లు అన్నీ బయట పడేసి..  సిబ్బంది నీటిని ఎత్తిపోస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితి తాత్కాలిక అసెంబ్లీ - సచివాలయంలో కనిపించింది.

ఈ విడత హైకోర్టు వంతు వచ్చింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సచివాలయం తరహాలోనే హైకోర్టు భవనంలోని పలు ఛాంబర్లలో సీలింగ్ నుంచి వర్షపు నీరు లీకైంది. దీంతో హైకోర్టు ఆవరణలోకి వచ్చిన వర్షపు నీటిని అక్కడ సిబ్బంది తోడి బయటపోశారు. గతంలో కూడా  ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు చేరిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు మంత్రులు ఛాంబర్ల్లో సీలింగ్ ఊడిపడి - ఏసీ ల్లోకి వర్షపు నీరు వచ్చింది. తాజాగా వర్షపు నీటితో.. హైకోర్టు భవన నిర్మాణం చేపట్టిన కంపెనీ డొల‍్లతనం మరోసారి బయటపడినట్లు అయింది. మొత్తంగా బాబు మార్కు వరల్డ్ క్లాస్ అంటే ఇలా కడితే... అలా వర్షపు నీటితో నిండిపోయే భవనాలేనన్న వాదన కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది.