Begin typing your search above and press return to search.

షాకింగ్... శ్రామిక్ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి

By:  Tupaki Desk   |   31 May 2020 2:30 AM GMT
షాకింగ్... శ్రామిక్ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి
X
శ్రామిక్ రైళ్లు.. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లోకి రాగా.. ఎక్కడికక్కడ చిక్కుబడిపోయి స్వస్థలాలకు చేరుకునేందుకు నానా అవస్థలు ఎదుర్కొంటున్న వసల కూలీలకు బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి నడిపిన రైళ్లు. కరోనా కారణంగా ఎక్కడిక్కడ రవాణా ఆగిపోగా... ఏ పనుల కోసమైతే ఊరు గాని ఊరు వచ్చారో.. అవే పనులు ఆగిపోగా... వలస వచ్చిన చోట తిండి లేక స్వస్థలాలే వెళ్లక తప్పదని కూలీలు భావించిన వేళ.. కేంద్రం శ్రామిక్ రైళ్లను నడిపింది. వసల కూలీలకు కొత్త జీవితాన్ని ఇస్తాయని భావించిన ఈ శ్రామిక్ రైళ్లే వారి పాలిట మృత్యువుగా మారాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన వారిలో ఏకంగా 80 మంది మృత్యువాత పడిన నేపథ్యంలోనే ఈ మాట వినిపిస్తోంది.

ఈ నెల 9 నుంచి 27వ తేదీ దాకా శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన వారిలో 80 మంది వలస కార్మికులు చనిపోయారని స్వయంగా రైల్వే శాఖ వెల్లడించింది. ఇక చనిపోయిన ఆ 80 మంది వలస కూలీల వివరాలను కూడా రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ 80 మందిలో కరోనా కారణంగా ఒక్కరు మాత్రమే చనిపోయారని కూడా రైల్వే శాఖ ప్రకటించింది. మిగిలిన వారంతా వేర్వేరు కారణాలతో చనిపోయినట్లుగా ఆ శాఖ వెల్లడించింది. శ్రామిక్ రైళ్ల సాయంతో స్వస్థలాలకు చేరిన వారిలో ప్రథానంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు చెందిన కార్మికులే అధికంగా ఉన్నారట. ఇటీవల ఓ శ్రామిక్ రైలు తన గమ్యస్థానానికి కాకుండా ఒడిశాకు దారి మళ్లడంతో అందులోని కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురైన సంగతి తెలిసిందే. మొత్తంగా వలస కార్మికులను వారి సొంతూళ్లకు చేర్చేందుకు నడిపిన శ్రామిక్ రైళ్లు వారి పాలిట మృత్యువుగా మారిందన్న వాదన వినిపిస్తోంది.