Begin typing your search above and press return to search.

భద్రతా సిబ్బందికి వణుకు పుట్టించిన రాహుల్

By:  Tupaki Desk   |   25 Jan 2021 7:10 AM GMT
భద్రతా సిబ్బందికి వణుకు పుట్టించిన రాహుల్
X
వీవీఐపీలకు రక్షణ అంటే మాటలు కాదు. వారెప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఒక పట్టాన అర్థం కాదు. పవర్ లో ఉంటే ఫర్లేదు. కాస్తో కూస్తో పద్దతిగా ఉంటారు. అదే చేతిలో అధికారంలో లేని వేళ.. ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. తాజాగా తమిళనాడు పర్యటనలో ఉన్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీరు భద్రతా సిబ్బందికి కొత్త సవాలుగా మారింది.

తిరుప్పూర్ జిల్లా ఊత్తుకుడికి వెళ్లిన ఆయన్ను చూసేందుకు.. ఆయన మాటలు వినేందుకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. భారీ సమూహాన్ని చూసిన రాహుల్ .. వెంటనే తన భద్రతా పరిధిని దాటేశారు. కాన్వాయ్ ను ఆపించి.. భద్రతా వలాయాన్ని దాటుకొని రోడ్డు కిందకు దిగారు. ఈ పరిణామాన్నిఏ మాత్రం ఊహించలేని ప్రజలు.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

తమ వద్ద ఉన్న తువ్వాలు.. శాలువాలను రాహుల్ కు బహుకరించారు. తనపై కప్పుతున్న వారిని ప్రోత్సహించేలా చేసిన రాహుల్.. పెద్ద వయస్కుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. వారిని అప్యాయంగా కౌగిలించుకుంటూ.. చిన్నారులతో ముచ్చటిస్తూ.. వారిని ఆశీర్వదిస్తూ చాలా దూరం అలా నడుచుకుంటూ వెళ్లారు. దీంతో.. భద్రతా బలగాలుటెన్షన్ పడ్డాయి. రాహుల్ కు రక్షణ కల్పించే విషయంలో వారుచెమటలు కార్చాల్సిన పరిస్థితి. జనం ఆయన మీద పడకుండా ఉండేందుకు భద్రతా బలగాలు.. ఆయనకు గోడలా నిలిచాయి.

అయితే.. రాహుల్ మాత్రం వారిని వారించి.. ప్రజలకు షేక్ హ్యాండ్లు ఇవ్వటం.. ఆత్మీయ హగ్గులకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో.. భద్రతా బలగాలు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏమైనా తమిళనాడులో రాహుల్ పర్యటన ఆయన సెక్యురిటీ సిబ్బందికి సినిమా చూపించిందన్న మాట వినిపిస్తోంది.