Begin typing your search above and press return to search.

పార్టీ నేత‌ల‌కు న‌ర‌సింహావ‌తారం చూపించిన రాహుల్!

By:  Tupaki Desk   |   27 May 2019 6:14 AM GMT
పార్టీ నేత‌ల‌కు న‌ర‌సింహావ‌తారం చూపించిన రాహుల్!
X
తొలిసారి కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్లో మ‌రో వ్య‌క్తి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ సీనియ‌ర్ నేత‌ల ఒత్తిళ్ల‌ను.. వారి బెదిరింపుల‌ను ప్ర‌స్తావించ‌ని రాహుల్.. ఈసారి అందుకు భిన్నంగా నిప్పులు చెరిగారు. ఎవ‌రికి వారికి వారి ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి.. పార్టీ గురించి ప‌ట్ట‌టం లేద‌న్నారు. తాజాగా వెల్ల‌డైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న వేళ‌.. అంత‌ర్గ‌త స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ చీఫ్ రాహుల్.. ఆయ‌న సోద‌రి ప్రియాంక గాంధీలు నిష్క‌ర్ష‌గా మాట్లాడారు. పార్టీ ప‌రాజ‌యాన్ని సునితంగా విశ్లేషించిన రాహుల్.. ఓట‌మికి త‌న బాధ్య‌త తీసుకుంటున్న‌ట్లు చెబుతూనే.. వైఫ‌ల్యంలో పార్టీ నేత‌ల బాధ్య‌త కూడా ఉంద‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. ఇంత సీరియ‌స్ గా మాట్లాడే రాహుల్ ను తాము ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నారు.

కొడుకులు.. వార‌సుల ఎదుగుద‌లే ముఖ్యం త‌ప్పించి.. పార్టీ ఏ మాత్రం ముఖ్యం కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన నేత‌ల ధోర‌ణిని సునిశితంగా ఎండ‌గ‌ట్టిన రాహుల్.. అందుకు త‌గ్గ ఉదాహ‌ర‌ణ‌ల్ని సైతం ప్ర‌స్తావించిన‌ట్లుగా తెలుస్తోంది. మాజీ కేంద్ర‌మంత్రి చిదంబ‌రం.. రాజ‌స్థాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులను టార్గెట్ చేస్తూ ఆయ‌న నిప్పులు చెరిగిన‌ట్లుగా స‌మాచారం.

కొడుకు కార్తికి టికెట్ ఇవ్వ‌కుంటే పార్టీకి రాజీనామా చేస్తాన‌ని చిదంబ‌రం బెదిరించార‌ని.. కొడుకు వైభ‌వ్ ను గెలిపించుకోవ‌టానికి పార్టీ ప్ర‌చారాన్ని ప‌క్క‌న పెట్టేసి వారం పాటు అశోక్ గెహ్లాట్ జోధ్ పూర్ లో ఉండిపోయార‌ని.. ఛింద్వారాలో కొడుకు కోసం అశోక్ గెహ్లాట్ మ‌కాం పెట్టేశార‌ని.. ఇలా ఎవ‌రికి వారు వారి వార‌సుల కోసం దృష్టి పెట్ట‌ట‌మే త‌ప్పించి.. పార్టీ మీద దృష్టి పెట్టింది లేద‌న్నారు.

టికెట్ విష‌య‌మై భిన్నాభిప్రాయం వ్య‌క్త‌మైన‌ప్పుడు..టికెట్ కోసం తెచ్చుకోలేక‌పోతే తాను ముఖ్య‌మంత్రిగా ఉండ‌టంలో అర్థం లేద‌ని క‌మ‌ల్ నాథ్ పేర్కొన్నార‌ని.. విప‌రీత‌మైన ఒత్తిడిని తెచ్చిన విష‌యాన్ని రాహుల్ ప్ర‌స్తావించారు.ఇలా చాలామంది నాయ‌కులు.. వారి పిల్ల‌లు.. బంధువులే ముఖ్య‌మ‌నుకుంటున్నార‌ని.. ఇలాంట‌ప్పుడు ప్ర‌జ‌ల‌కేం చెబుతామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్లుగా తెలుస్తోంది.

దాదాపుగా నాలుగు గంట‌ల పాటు హాట్ హాట్ గా సాగిన స‌మావేశంలో ప‌లుమార్లు ప్రియాంక గాంధీ క‌ల్పించుకొని.. పార్టీ ఓట‌మికి కార‌ణ‌మైన వారంతా ఈ స‌మావేశంలోనే ఉన్నార‌ని ఆమె చాలా నిష్టూరంగా మాట్లాడిన‌ట్లుగా చెబుతున్నారు. తాను పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగే అవ‌కాశం లేద‌ని రాహుల్ చెప్ప‌గా.. నేత‌లంతా ముక్త కంఠంతో ఉండాల‌ని కోరిన‌ట్లుగా చెబుతున్నారు. సమావేశం మ‌ధ్య నుంచి రాహుల్ వెళ్లిపోగా.. ఆయ‌న్ను ఒప్పించే బాధ్య‌త‌ను సోనియా.. ప్రియాంక‌ల మీద పార్టీ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.