Begin typing your search above and press return to search.

వన్స్ మోర్ అంటున్న రాహుల్....ఈ సారి మోడీ కోట నుంచే

By:  Tupaki Desk   |   7 Feb 2023 9:22 AM GMT
వన్స్ మోర్ అంటున్న రాహుల్....ఈ సారి మోడీ కోట నుంచే
X
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీలో ఇంతటి ఉత్సాహం ఉత్తేజం ఉంటుందని బహుశా ఆయనకు కూడా తెలియదేమో. యాభై దాటిన వయసులో రాహుల్ కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ చేసిన పాదయాత్ర ఒక రికార్డు. ఎందుకు అంటే కేవలం 134 రోజుల వ్యవధిలోనే నాలుగు వేల కిలోమీటర్లను ఆయన అతి సునాయాసంగా నడించేశారు. అంతే కాదు పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టేశారు. తాజాగా కాశ్మీర్ లో తన పాదయాత్రను ముగించిన రాహుల్ గాంధీ ఇపుడు రెండవ విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారని అంటున్నారు.

రాహుల్ భారత్ జోడో యాత్ర అనుకున్న దాని కంటే కూడా ఎక్కువగా విజయవంతం అయింది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. రాహుల్ అంటే పట్టని వారు సైతం దగ్గర అయ్యారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అనే అతి పెద్ద జాతీయ పార్టీ దిక్కుగా ఉందన్న నిబ్బరాన్ని ఇటు జన సామన్యంతో పాటు అటు బీజేపీ యేతర రాజకీయ పార్టీలకు కూడా రాహుల్ గాంధీ కలిగించారు. దాంతో పాటు ప్రధాని అభ్యర్ధిగా ఆయన బాగానే ప్రొజెక్ట్ అయ్యారు.

ఇక రాహుల్ అంటే ఏంటి అన్నది సామాన్య జనాలకు బాగా తెలిసింది. విమానాల్లో తిరుగుతూ ఏసీ గదులలో ఉండే రాహుల్ ఎండనకా వాననకా దేశంలోని అనేక రాష్ట్రాలలో వేల కొలదీ కిలోమీటర్లను తిరగడం అంటే రాహుల్ లోని సమర్ధతను పట్టుదలను అది తెలియచేసింది.

ఆయన మాటలు చెబుతారు చేతలకు దూరం అన్న ప్రత్యర్ధుల విమర్శలు పటాపంచలు అయ్యాయి. ఆయనలోని నిలకడతనానికి కూడా పాదయాత్ర మచ్చుతునకలా నిలిచింది.

ఆయన సామాన్య జనానికి కాంగ్రెస్ పార్టీని దగ్గర చేయగలిగారు. ఒక ప్రణాళిక ప్రకారం తక్కువ రోజులలో పాదయాత్ర ముగించి మంచి ఫలితాలు అందుకున్న రాహుల్ ఇపుడు పశ్చిమ భారత దేశం వైపుగా పాదయాత్ర చేపట్టనున్నారని అంటున్నారు. ఈసారి మోడీ కోట అయిన గుజరాత్ నుంచే రెండవ విడత భారత్ జోడో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అని అంతున్నారు. మహాత్ముడు పుట్టిన పోరు బందర్ నుంచి రాహుల్ గాంధీ రెండవ విడత పాదయాత్ర స్టార్ట్ అయి ఈశాన్య రాష్ట్రం అసోం దాకా ఈ పాదయాత్ర సాగనుంది అని అంటున్నారు.

ఈ పాదయాత్ర కనుక పూర్తి చేస్తే రాహుల్ మొత్తం భారత్ ని చుట్టేసినట్లు అవుతుంది అని అంటున్నారు. ఇక ఈ నెలలో పోరుబందర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రకటిస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయిన తరువాత రాహుల్ రెండవ విడత పాదయాత్ర ఉండవచ్చు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.