Begin typing your search above and press return to search.

జగన్ కు రఘురామ సూటి ప్రశ్న.. నాకెందుకు టికెట్ ఇచ్చినట్లు?

By:  Tupaki Desk   |   25 July 2021 3:44 PM GMT
జగన్ కు రఘురామ సూటి ప్రశ్న.. నాకెందుకు టికెట్ ఇచ్చినట్లు?
X
ప్రత్యర్థులకు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు తాగిస్తున్న ఏపీ అధికారపక్షానికి.. స్వపక్షానికి చెందిన రెబల్ ఎంపీ రఘురామ తీరు ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారిందని చెబుతారు. ప్రత్యర్థులపై తాము విరుచుకుపడే తీరుకు తగ్గట్లే.. తమపై నరసాపురం ఎంపీ వ్యవహారశైలి ఉందన్న మాటను వైసీపీ నేతల మాటల్లో వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. పాయింట్ల వారీగా తనపై చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నారు రఘురామ. అదే సమయంలో.. అధినేత కమ్ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. సమయం.. సందర్భం చూసుకొని మాటల్ని అస్త్రాలుగా సంధిస్తున్నారు.

రఘురామ తీరుతో ఏపీ అధికారపక్షం చాలా సీరియస్ గా ఉంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా అతడికి సరైన పాఠం చెప్పాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతారు. ఇప్పటికే పలుమార్లు రఘురామపై ఫిర్యాదులు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు కూడా. దీనిపై రఘురామ స్పందిస్తూ.. తనపై వేటు పడదన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎంపీ రఘురామపై ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదుపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఫైర్ బ్రాండ్ సూటి ప్రశ్నల్ని సందిస్తున్నారు.

తాను బ్యాంకు రుణాల్ని ఎగ్గొట్టినట్లుగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి లేఖ రాయటాన్ని రఘురామ తీవ్రంగా తప్పు పట్టారు. పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఉన్న విజయసాయి తనను విమర్శించటానికి హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించటంతో పాటు.. ‘‘ఆయనపై ఛార్జిషీట్ దాఖలైంది. అలాంటి వారు నేను బ్యాంకు రుణాల్ని ఎగ్గొట్టినట్లుగా లేఖ రాయటం సరి కాదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందని రఘరామ తీవ్రంగా రియాక్టు అయ్యారు.

సొంత పార్టీ అధినేతపై పిటిషన్ వేయటం ద్వారా ఎంపీ రఘరామ వార్తల్లోకి రావటం తెలిసిందే. అధినేత కమ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉంటూ బెయిల్ మీద బయట ఉన్న సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై మొండిగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. రఘురామపై చర్యలకు పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో రఘురామ మరింత సీరియస్ గా రియాక్టు అయ్యారు.

తాను అక్రమాలకు పాల్పడ్డానని పేర్కొనటం విడ్డూరంగా ఉందని.. ఒకవేళ తనపై అన్నిఫిర్యాదులు ఉంటే.. 2019లో తనకు లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున టికెట్ ఎందుకు ఇచ్చినట్లు? అని ప్రశ్నిస్తున్నారు. తనపై అన్ని కంప్లైంట్లు ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా వేరే వారికి టికెట్ ఇవ్వాల్సింది కదా? తనకే ఎందుకు ఇచ్చినట్లు? చెప్పాలంటున్న ఎంపీ రఘురామ వ్యాఖ్య అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేస్తుందన్న మాట వినిపిస్తోంది.