రఘునందన్ రావు సంచలనం.. టీఆర్ఎస్ నేతలే గెలిపించారట.!

Sat Nov 21 2020 22:40:15 GMT+0530 (IST)

Raghunandan Rao sensation .. TRS leaders helped to win.!

తెలంగాణ రాజకీయాలను షేక్ చేసి ఫలితం దుబ్బాక.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా గెలిచారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీజేపీకి ఊపిరిలూదిన ఈ ఫలితంతో ఇప్పుడు తెలంగాణపై దండెత్తుకొచ్చింది కమలదళం. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రఘునందన్ రావు తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు.దుబ్బాకలో తనను గెలిపించింది టీఆర్ఎస్ నేతలే అని బాంబు పేల్చారు. తెలంగాణ ఉద్యమంలో తాను అనేకమందితో కలిసి పనిచేశానని..గతంలో పోటీచేసి ఓటమి పాలయ్యానని.. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సానుభూతితో గెలిచానని తెలిపారు. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని ఎవరూ అంచనావేయలేదని.. మేం నిలబడి విజయం సాధించామని తెలిపారు.

మాతోపాటు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న రఘునందన్ రావుకు ఓటు వేస్తే తప్పేంటన్న ఆలోచనతో టీఆర్ఎస్ నేతలు కూడా తనకు ఓటేసి గెలిపించారని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక తనను టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకి పంపించారో ఇప్పటికీ సమాధానం లేదని రఘునందన్ రావు అన్నారు. ఇక సమాధానం వస్తుందని అనుకోవడం లేదు అని తెలిపారు.

బీజేపీలో చేరిన తనను పార్టీ ఆదరించి పోటీచేసే అవకాశం ఇచ్చిందని తెలిపారు. దుబ్బాక విజయం బీజేపీదేనని.. బీజేపీని వేరుగా చూడాల్సిన అవసరం రాదన్నారు. తన నియోజకవర్గానికి రావాల్సింది సామరస్యంగా అడిగి చూస్తానని.. లేదంటే కొట్లాడి సాధిస్తానని రఘునందన్ రావు అన్నారు.