Begin typing your search above and press return to search.

తిరుపతికి బాలాజీ పేరేంటి స్వామీ... ?

By:  Tupaki Desk   |   27 Jan 2022 5:30 PM GMT
తిరుపతికి బాలాజీ పేరేంటి స్వామీ... ?
X
కొత్త జిల్లాల పేరిట ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఎన్నో విశేషాలూ తమాషాలు ఉన్నాయి. కొన్ని సెంటిమెంట్లు దెబ్బతినేలా నొచ్చుకునేలా కూడా ఉన్నాయని అంటున్నారు. సకల లోకాలకు దేవదేవుడు అయిన తిరుపతి శ్రీ వెనకటేశ్వరస్వామి వారి సన్నిధిలో కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం మంచి పరిణామమే. అదే సమయంలో ఆ దేవుడికి ఉన్న అనేక బహు చక్కని పేర్లలో ఒక్కటీ పెట్టడానికి పెట్టడానికి తోచలేదా అన్నదే ఆస్థిక జనులతో పాటు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

తాజా నోటిఫికేషన్ లో తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా అని ప్రకటించారు. బాలాజీ అన్నది ఎక్కడా వాడుకలో లేని పేరుగా అంటున్నారు. అదే సమయంలో అది ఉత్తరాది పేరుగా చెబుతున్నారు. ఇక అక్కడ కూడా బాలాజీ అంటే ఆంజనేయస్వామి వారి పేరుగా పేర్కొంటారు. మరి ఆ పేరుని తిరుపతి స్వామి వారి సన్నిధానంలోని కొత్త జిల్లాకు పెట్టడం ఏంటి అన్న ప్రశ్నను వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు సూటిగానే తన బాణాన్ని సంధించారు.

ఇలా చేయడమేంటి అసలు ఏమైనా అర్ధముందా అంటూ ఆయన చాలా గట్టిగానే గద్దించారు. బాలాజీ అన్న పేరుతో స్వామి వారి భక్తుడిని శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో చూపించారు అని కూడా ఆయన గుర్తు చేశారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఇవ్వన్నీ తెలియవని తాను కచ్చితంగా భావిస్తున్నాను అని ఆయన తనదైన శైలిలో బాగానే సెటైర్లు వేశారు. అదే సమయంలో తిరుపతిలో ఉన్న ఈవో జవహర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ సీఎం కి చెప్పలేదా అని నిలదీశారు. బాలాజీ అన్న పేరుని తెలుగు నాట నూటికి ఒక శాతం కూడా వాడరని రాజు స్పష్టంగా చెప్పేశారు.

అధికారులు చెప్పరు, సీఎం కి తెలియదు, అంతమాత్రాన ఇలా నోటికి వచ్చిన పేర్లు పెట్టేస్తారా అంటూ రాజు ఫైర్ అయ్యారు. తిరుపతి కేంద్రంగా ఉన్న కొత్త జిల్లాకు శ్రీ వెంకటేశ్వరసామి అనో, లేక శ్రీనివాసుడు అనో పేరు పెడితేనే సబబుగా ఉంటుందని ఆయన సూచించారు. మరో వైపు చూస్తే ఏలూరుకు దగ్గరగా ఉనన్ చిన్న తిరుపతిని తీసుకెళ్ళి తూర్పు గోదావరి జిల్లాలో కలిపేసారని ఆయన మండిపడ్డారు.

ఇక కడప అంటే ఎంతో విశిష్టత ఆధ్యాత్మికత ఉన్న ప్రాంతమని రాజు గుర్తు చేశారు. దానికి దేవుడి గడప అని మరో పేరు అని కూడా పేర్కొన్నారు. అలాంటి కడప, కవులకు, కళాకారులకు ఆరాధ్యమైనదని, అలాటి జిల్లాలో కడప పేరుని ఇపుడు లేకుండా చేశారని, కేవలం వైఎస్సార్ జిల్లా అని మాత్రమే మార్పు చేసిన నోటిఫికేషన్ లో పేర్కొనడం బాధాకరమని రాజు అన్నారు.

కులాల మధ్య చిచ్చు పెట్టడానికో మరో దానికో ఈ జిల్లాల పేర్లను వాడుకోరాదని, అలాగే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచేదిగా కూడా ఈ ప్రక్రియ ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల ప్రక్రియను బాధ్యాతయుతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే రాజు తనదైన పంచులు వేయకుండా విడిచిపెట్టలేదు. ఇన్ని సూచనలు చేసిన ఆయన చివరికి ఈ జిల్లాలు అయ్యేనా పోయేనా అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చేశారు. 2021 జనాభా గణన పూర్తి అయ్యే దాకా వీటికి ఏ రకమైన మోక్షం లేదని తేల్చిపారేశారు. కేవలం ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకే దీన్ని వైసీపీ పెద్దలు తీసుకువచ్చారని కూడా ఆరోపించడం విశేషం. మొత్తానికి రాజా వారా మజాకా అన్నట్లుగా జగన్ సర్కార్ తో బాగానే మాటల చెడుగుడు ఆడేశారు.