రాఫెల్ ఎపిసోడ్ లో మోడీ మునగనున్నారా?

Thu Jul 26 2018 14:27:17 GMT+0530 (IST)

ప్రధాని మోడీని గమనించారా?  ఆయనలో స్టైల్ షీట్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. డిజైనర్ డ్రెస్సులతో ఒకసారి వేసుకున్నది మరోసారి వేసుకోనట్లుగా ఉండే ఆయనలో ఆడంబరం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దేశంలో పలువురు ముఖ్యమంత్రులకు క్లీన్ చిట్ ఇచ్చే ఆయన.. తనకు తానుగా ఎప్పటికప్పుడు సచ్ఛీలుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారైతే.. తమకు మోడీ సైతం క్లీన్ చిట్ ఇచ్చారని.. నోరు కట్టుకొని మరీ తాము పని చేస్తున్నట్లు చెబుతారు. తెలంగాణ సచివాలయం వద్ద కనిపించే దృశ్యాల్ని చూస్తే.. కేసీఆర్ చెప్పే మాటల్లో నిజం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.ఆ విషయాన్ని పక్కన పెడితే.. మోడీ సర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేశంగా మాట్లాడుతూ.. రాఫెల్ డీల్ ఒక భారీ స్కామ్ అని.. రూ.35వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకురూ.45 వేల కోట్లు లబ్థి చేకూర్చే ప్రయత్నం చేశారంటూ బాంబు లాంటి ఆరోపణ చేశారు. దీనికి బీజేపీ నేతలు కలిసికట్టుగా తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు.

రాహుల్ చేసిన ఆరోపణలపై.. గంటల వ్యవధిలోనే ఫ్రాన్స్ మీడియాలో వచ్చిన వార్తల్ని సైతం బీజేపీ నేతలు ప్రస్తావించటం మర్చిపోకూడదు. రాహుల్ ఆరోపించిన ప్రైవేటు సంస్థ ఏమిటన్న దానికి సమాధానంగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ ను చూపిస్తున్నారు.

మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఫ్రాన్స్ కు మోడీ 2015 ఏప్రిల్ 10 ప్రయాణం అయ్యారు. అక్కడ 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డసాల్ట్ ఏవియేషన్ డిఫెన్స్ లిమిటెడ్ తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మోడీ ఫ్రాన్స్ టూర్ కు వెళ్లటానికి  పది రోజుల ముందే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ను ఏర్పాటు చేశారు.

నిజానికి రిలయన్స్ కు సంబంధించి చాలానే సంస్థలు తెలిసినవే అయినా.. రిలయన్స్ డిఫెన్స్ అనే సంస్థ పేరు కొత్తగా వినిపించట్లేదు. నిజమే.. మీ సందేహం కరెక్టే. ఒక భారీ డీల్ కుదుర్చుకోవటానికి ఒక దేశ ప్రధాని విదేశీ పర్యటనకు కేవలం పది రోజుల ముందుగా ఒక సంస్థను రిలయన్స్ స్టార్ట్ చేయటం.. అది కాస్తా డసాల్ట్ కంపెనీతో పార్టనర్ షిప్ గా మారటం చూస్తే.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లు కనిపించట్లేదు?

మరీ ఈకలు పీకేలా మాట్లాడుతున్నారు?  ఏం కంపెనీ పెట్టటం.. ఆ వెంటనే భారీ డీల్ చేసుకోవటం తప్పా? అన్న డౌట్ మీకు రావొచ్చు. అక్కడికే వస్తున్నాం. మరి.. అంత భారీ డీల్ కుదుర్చుకునే సంస్థ మూలధనం (అదేనండి పెట్టుబడి) ఎంతో తెలుసా?  అక్షరాల రూ.5లక్షలు మాత్రమే. అంత తక్కువ మూలధనంతో ఏర్పాటైన సంస్థ అన్ని వేల కోట్ల రూపాయిల ఒప్పందం ఎలా కుదర్చుకోగలిగింది?  అందుకు మోడీ సర్కార్ ఎలా అనుమతి ఇచ్చింది?  ప్రధాని ఫ్రాన్స్ కు బయలుదేరేందుకు కేవలం పది రోజుల ముందే పెట్టిన సంస్థతో డసాల్ట్ అనే సంస్థ ఎలా చేతులు కలిపింది?

అనిల్ అంబానీ కంపెనీతో తమ ప్రయాణం మొదలైందన్న మాటను గతంలో ఎప్పుడైనా డసౌల్ట్ చెప్పిందా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఇవన్నీ అనుమానాలైతే.. యూపీఏ హయాంలో ఫిక్స్ చేసిన రూల్స్ ను పక్కన పెట్టి భారీ ఒప్పందానికి తెర తీయటం విశేషం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రిలయన్స్ అనిల్ సీన్లోకి వచ్చారు. ఈ ఒప్పందంలో కేంద్రం పాత్ర లేనే లేదని.. పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంగా చెబుతున్నారు. తమకు రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో తమకు భారీ నైపుణ్యం ఉందని.. కొన్ని రంగాల్లో తమదే పైచేయిగా చెప్పుకోవటం చూస్తే.. విషయం కాస్త కాస్తగా అర్థం కావట్లేదు. ఇదిలా ఉంటే.. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోడీ.. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ పార్టీ సభాహక్కుల ఉల్లంఘణ ను పెట్టింది. సభను తప్పుదోవ పట్టించినందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.దీనిపై స్పీకర్ మహాజన్ స్పందిస్తూ..  నోటీసును పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే.. రాఫెల్ వ్యవహారం మోడీ ఇమేజ్ ను ఏదో చేయనుందన్న నమ్మకం కలగట్లేదు..?