సాఫ్ట్‌వేర్ సాయంతొ ఇసుక అక్రమ వ్యాపారం.. ప్రత్యేక యాప్ తో దందా!

Thu Jul 16 2020 20:32:06 GMT+0530 (IST)

Sand smuggling with the help of software ..  with a special app

ఇసుక అనేది బంగారంగా మారింది. తెలుగు రాష్ట్రాలు ఇసుక విధానంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. గతంలో ఇసుక అక్రమార్కుల వరం కాగా దాన్ని అరికట్టేందుకు మొత్తం ఆన్‌లైన్ విధానం తీసుకొచ్చారు. అవసరమైన వారికి ఇసుక అందాలని.. పారదర్శకంగా ఇసుక కేటాయించాలని నిర్ణయించి రెండు రాష్ట్రాలు ఇసుక విధానంలో సాంకేతికతకు పెద్ద పీట వేశారు. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా ఇసుక మాత్రం అక్రమార్కులకు ఎలాంటి కట్టడి చేయడం లేదు. వారి అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా సాంకేతికతలో కూడా ఆ అక్రమార్కులు తమ చేతివాటం చూపించి దండుకుంటున్నారు. అలాంటి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.అక్రమార్కులు వినూత్న మార్గాలను ఎంచుకొని దందా కొనసాగిస్తున్నారు. ఇసుక విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ప్రత్యేక పోర్టల్ తయారు చేసి.. రోజులో 15 నిమిషాల పాటే ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యతో కొంత అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. యాక్సెస్ ఉన్న 15 నిమిషాల్లో ఎన్ని ఆర్డర్‌లు బుక్ అయితే అంతమందికే ఇసుక అందుతోంది. అయితే పెద్దసంఖ్యలో ఆర్డర్‌లు బుక్ చేసుకునేలా అక్రమార్కులు సాంకేతికంగా కూడా అప్‌డేట్ అయి ఆన్‌లైన్‌లోనే మోసాలకు పాల్పడుతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన సోదరులు సిసోడియా ఆదేశ్ సిపోడియా హరినాథ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పోర్టల్‌ను హ్యాక్ చేసి అధిక మొత్తంలో ఆర్డర్లు వచ్చేలా చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని కొత్తపేటలో ఉన్న స్నేహితుడి ఇంట్లో ఉంటూ రోజువారీ బుకింగ్‌లలో అత్యధిక బుకింగ్‌లు సొంతం చేసుకొని కమిషన్ల రూపంలో రూ.లక్షల్లో గడిస్తున్నారు.

ఈ విషయం రాచకొండ ఎస్‌వోటీ సైబర్ క్రైం పోలీసుల దృష్టికి రావడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆ సోదరులకు 5 ఇసుక లారీలు ఉండగా సాండ్ సేల్స్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (ఎస్‌ఎ్‌సఎంఎంఎస్) పోర్టల్ లో అధిక ఆర్డర్లు వచ్చేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. గూగుల్ యూట్యూబ్‌లో శోధించి పేటీఎం యాడ్‌లో ఆటోఫిల్ అనే సాఫ్ట్‌వేర్‌ను గుర్తించారు. ఆ యాడ్ రిప్రజెంటేటివ్‌ను సంప్రదించి ఆటోఫిల్ సాఫ్ట్‌వర్‌ను కొనుగోలు చేసి తమ 5 ల్యాప్‌టాప్‌లలో ఇన్‌స్టాల్ చేశారు. ఒక్కసారి వివరాలు బ్యాంకు ఖాతా నమోదు చేసి సేవ్ చేస్తే క్షణాల్లో బుకింగ్‌లు అయిపోతాయి. ఐడీ నంబర్ జనరేట్ కాగానే వాళ్ల వద్ద సేవ్ చేసి ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు చెల్లించేవారు.

ఇలా 5 ల్యాప్‌టాప్‌ల ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే అత్యధిక ఆర్డర్లు బుకింగ్ చేస్తున్నారు. దీంతో అవసరాన్ని బట్టి కస్టమర్ల నుంచి అధిక మొత్తంలో కమిషన్ పొందుతున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ కొన్ని రోజులకు మొరయించడంతో పుణెకు చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనురాగ్ ను సంప్రదించారు. అతడు వేగంగా బుకింగ్‌లు చేసేలా సాఫ్ట్‌వేర్ తయారు చేయడంతో పాటు ప్రభుత్వ పోర్టల్ వంటి నమూనా కలిగిన పోర్టల్‌ను రూపొందించాడు. దాని సహాయంతో ఇంటర్నెట్‌లో ఉంచి ఇసుక కావాల్సిన కస్టమర్లను ఆకర్శించడానికి ప్రకటనలిచ్చి అత్యధికంగా ఆర్డర్లు రావడంతో వాటిని భారీ రేట్లకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విధంగా సాంకేతికత ఆధారంగా కూడా మోసగాళ్లు నేరాలకు పాల్పడుతూ ప్రభుత్వ పోర్టళ్లనే హ్యాక్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు.