Begin typing your search above and press return to search.

నేడు ఆర్టీసీ సమ్మె కి ముగింపు పలకబోతున్నారా..?

By:  Tupaki Desk   |   20 Nov 2019 6:27 AM GMT
నేడు ఆర్టీసీ సమ్మె కి ముగింపు పలకబోతున్నారా..?
X
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు 46 రోజులుగా ఉధృతం గా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం లో కొంతైన చలనం రాకపోవడం తో ఆర్టీసీ కార్మికులు అయోమయంలో పడ్డారు. సమ్మె కు సంబంధించి హైకోర్టు లో వాదనలు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం కార్మికుల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్న ఆశతో ఉన్న కార్మికులకు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తుంది అనుకుంటే కేసుని లేబర్ కోర్టు కి బదిలీ చేసింది. దీనితో సమ్మె కొనసాగింపు విషయం లో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి బుధవారం న్యాయవాదులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది.

ప్రభుత్వం మాత్రం సమ్మె విషయం లో కఠినంగా వ్యవహరిస్తున్నందున, ఉద్యోగ భద్రత ను దృష్టి లో ఉంచుకొని సమ్మె విషయాన్ని తేలిస్తే బాగుంటుందంటూ జేఏసీ నేతలపై ఒత్తిడి వచ్చింది. దీంతో జేఏసీ లోని కార్మిక సంఘాలు విడివిడిగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సమావేశాల్లో ఎక్కువ శాతం కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని తెలిపినట్టు సమాచారం. మరి కొంతమంది మాత్రం ఇన్ని రోజులు సమ్మె చేసి ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించక పోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని, తాడో పేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అలాగే సమ్మె కొనసాగిస్తే ఉద్యోగ భద్రత కరువైందన్న ఆందోళన తో మరికొందరు మరణించే ప్రమాదం ఉన్నందున ఈ విషయాన్ని కూడా పరిగణించాలని కొందరు సూచించారు.

ఆర్టీసీ జేఏసీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపోల కు సంబంధించిన కమిటీల ప్రతినిధులు తేల్చిచెప్పారని సమావేశానంతరం అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం న్యాయవాదులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె.. తదనంతర పరిణామాల పై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కార్మికుల ఉద్యోగ భద్రత పై చర్చించనున్నారు. దీన్ని బట్టి చూస్తే ..ఆర్టీసీ సమ్మె కి ముగింపు పలికే అవకాశం ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది.