Begin typing your search above and press return to search.

అర్థరాత్రి లోపే హైదరాబాద్ కు వచ్చేయమంటున్నారు

By:  Tupaki Desk   |   8 Nov 2019 8:05 AM GMT
అర్థరాత్రి లోపే హైదరాబాద్ కు వచ్చేయమంటున్నారు
X
గడిచిన 35 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె మరో అడుగు ముందుకు పడింది. మొన్నటికి మొన్న సరూర్ నగర్ లో బహిరంగ సభ నిర్వహించిన టీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ఇప్పుడు చలో ట్యాంక్ బండ్ కు పిలుపునివ్వటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ తరహాలో చలో ట్యాంక్ బండ్ కు పిలుపునిచ్చింది.

శనివారం నిర్వహించ తలపెట్టిన ఈ ఆందోళనకు టీఎస్ ఆర్టీసీ జేఏసీకి విపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు.. ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం కాకుండా చూడాలన్న పట్టుదలతో ప్రభుత్వం కూడా ఉంది.

దీంతో పోలీసుల్ని ప్రయోగించి జేఏసీ నేతల్ని ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల అక్రమ అరెస్టుల్ని జేఏసీ నేతలు ఖండిస్తున్నారు. ఇలాంటి వేళ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

చల్ ట్యాంక్ బండ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల ఇళ్లల్లో దాడులు చేసిన అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా కార్మికులని చూడకుండా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిర్బందాలు ఎదురైనా సరే.. చలోట్యాంక్ బండ్ నిర్వహించటం ఖాయమని తేల్చి చెప్పిన అశ్వత్దామరెడ్డి.. చలో ట్యాంక్ బండ్ ను విజయవంతం చేసేందుకు వీలుగా జిల్లాల నుంచి శుక్రవారం రాత్రి నాటికే హైదరాబాద్ కు చేరుకోవాలన్నారు. మరి.. చలో ట్యాంక్ బండ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.