Begin typing your search above and press return to search.

ఆర్జీవీ చెత్త ట్వీట్ల వేళ.. పురాణాల్లో వారాహి స్థానం తెలుసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   25 Jan 2023 10:10 AM GMT
ఆర్జీవీ చెత్త ట్వీట్ల వేళ.. పురాణాల్లో వారాహి స్థానం తెలుసుకోవాల్సిందే
X
తెలివి అందరికి ఉంటుంది. కాకుంటే కొందరికి తెలివి అతిగా ఉంటుంది. అలాంటి తెలివితేటల్ని ప్రదర్శించే వారిని అతితెలివి అనేస్తుంటారు. వివాదాస్పద దర్శకుడు.. చెత్త మాటలతో.. అవసరం లేని మాటల్ని మాట్లాడటం ద్వారా పాడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాంగోపాల్ వర్మ.. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కు చెందిన వారాహి వాహనం మీద ఆయన చేస్తున్న తాజా ప్రచారం గురించి తెలిసిందే.

వారాహిని అమ్మవారిగా కొలిచేస్తుంటారన్నది తెలిసిందే. పంది ముఖం ఉన్న ఆ శక్తి మాత పేరు వచ్చేలా తన వాహనానికి పేరు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన వర్మ.. పందివాహనం అంటూ కొత్త ఎత్తుగడను ట్వీట్ రూపంలో సంధించారు. ఇంతకూ వారాహి అంటే ఏమిటి? పురాణాల్లో దానికున్న స్థానం ఏమిటి? అన్న విషయాలు తెలుసుకున్నప్పుడు వర్మ చేసే ట్వీట్లలోని డొల్లతనం ఇట్టే అర్థం కావటమే కాదు.. తనకు నచ్చని విషయాల్ని ఎంత దారుణంగా ప్రచారం చేస్తారో అర్థమవుతుంది.

ఇక.. పురాణాల విషయానికి వస్తే.. వారాహి దేవి.. పంది ముఖం కలిగి.. పది చేతులు ఉన్న ఒక దేవత. ఆమె వాహనం పులి. శక్తి రూపాల్లో ఒకటిగా.. సప్త మాతృకలలో ఒకరిగా కొలుస్తుంటారు. ఆమె ముఖం పంది రూపంలో ఉన్నా.. ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా కొందరు కొలుస్తుంటారు. లక్ష్మీదేవి రూపంలో కొలిచే వేళలో ఆమెను మనిషి రూపంలో పూజిస్తారు. నేపాల్ లో ఆమెను బారాహిగా పేర్కొంటారు.

వారాహి దేవిని శైవులు మాత్రమే కాదు వైష్ణవులు.. శాక్తేయులు కూడా పూజిస్తారు. హిందువులు మాత్రమే కాదు బౌద్ధులు సైతంఆమెను కొలుస్తుంటారని.. మరీచి.. వజ్రవారాహి పేర్లతో ఆమెను అభివర్ణిస్తారని చెబుతారు. వామాచారం పాటించే వారు రాత్రి వేళలో తాంత్రిక పద్దతిలో పూజలు చేస్తుంటారు. వివిధ పురాణాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. ఆయా పురాణాల విషయాలకు వస్తే..

మార్కండేయ పురాణం ఇందులో దేవుళ్ల శరీరాల నుంచి స్త్రీ రూప శక్తులు ఉద్బవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మణి .. అదే రీతిలో వరాహ స్వామి నుంచి వారాహి జన్మిస్తుంది. వారాహి వరహ రూపం అంటే.. పంది రూపంలో ఉండి.. చేతిలో చక్రం.. ఖడ్గంతో ఉన్నట్లుగా ఇందులో వర్ణిస్తారు.

ఈ పురాణం ప్రకారం.. వారాహి వరాలు ఇచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు కాపు కాస్తుంది. దేవీ మహత్మ్యం ఇందులో రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడ్ని.. అతడి సేనల్ని సంహరిస్తుంది. వామన పురాణం ఇందులో మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు. వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది. దేవీ భాగవత పురాణం దీని ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటు అమ్మవారు సృష్టించారు. దేవతల్ని రక్షించేందుకు ఈ మాతృకలున్నారని చెబుతారు.

వరాహ పురాణం ఇందులో రక్తబీజుడి కథ వస్తుంది. ఈ కథలో ఒక మాతృక నుంచి మరో మాతృక పుడుతుందని పేర్కొన్నారు. ఇందులో వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది. ఈ పురాణం ప్రకారం ఆసూయ అనే వికారానికి ఆమె అధిదేవత.

మత్య్సపురాణం దీని ప్రకారం చూస్తే.. ఈమె పుట్టుకలో శివుడు ఉంటాడు. అంధకాసురుడు అనే రాక్షసుడ్ని సంహరించేందుకు శివుడి సాయంతో ఆమె పుట్టుక ఉంది. అంధకాసురుడు ఎంత బలవంతుడంటే.. రక్తబీజుడి మాదిరి భూమి మీద ఈ రాక్షసుడి రక్తం బొట్టు ఒక్కటి పడ్డా.. దాని ద్వారా మళ్లీ పుట్టుకొస్తాడు. అంతటి బలవంతుడ్ని సంహరించేందుకుఆమె రంగంలోకి దిగినట్లుగా చెబుతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.