Begin typing your search above and press return to search.

ద్రౌపదిపై రాంగోపాల్ వర్మ రాజీ.. బీజేపీకి ధన్యవాదాలు

By:  Tupaki Desk   |   26 Jun 2022 5:30 AM GMT
ద్రౌపదిపై రాంగోపాల్ వర్మ రాజీ.. బీజేపీకి ధన్యవాదాలు
X
వివాదాలతో సహవాసం చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసి రాజేస్తుంటాడు. నిత్యం ఏదో ఒక వివాదం లేనిదో పొద్దు గడవదు. యధార్థ ఘటనలను సినిమాలుగా చూపించే డిఫరెంట్ రైటర్.. ఆయన మాట్లాడినా వివాదమే.. సైలెన్స్ గా ఉన్న సంచలనమే.. ట్వీట్ చేస్తే వార్..కామెంట్ చేస్తే రచ్చ రచ్చ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో ప్రత్యేకం. తెలుగు నుంచి హీందీ వరకు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన వాళ్లు ఎక్కువే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు సైతం ఆర్జీవి సినిమాకు వద్దనకుండా నటించేస్తారు.

ఇక ఆర్జీవీ సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సంఘటనలపై స్పందిస్తారు. ముఖ్యంగా సమకాలీన రాజకీయాలు అంటే ఈ డైరెక్టర్ కు బాగా ఇష్టం. పోలిటికల్ రంగంపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తారు. తాజాగా దేశంలో హాట్ టాపిక్ గా మారిన 'రాష్ట్రపతి ఎన్నికల'పై వర్మ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు' అంటూ వర్మ కామెంట్ చేశారు.

రాంగోపాల్ వర్మ ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్ పై బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ నేత గూడురు నారాయణరెడ్డిలు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ద్రౌపది ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్మ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని అబిడ్స్ పోలీసులను కోరారు. మహిళపట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే వర్మపై బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని అబిడ్స్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు.

ఇక ద్రౌపది ముర్ముపై చేసిన ట్వీట్ విషయంలో రాంగోపాల్ వర్మపై విమర్శలు రావడంతో వర్మ మరోసారి స్పందించారు. ఇది కేవలం వ్యంగ్యంతో చేశానని.. వేరే విధంగా ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. మహా భారతంలోని ద్రౌపది నాకు చాలా ఇష్టమైన పాత్ర అని.. ఇలాంటి పేరు చాలా అరుదు కాబట్టి కొన్ని సంబంధిత పాత్రలు గుర్తుకు వచ్చాయని అంటూ చెప్పుకొచ్చారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో తాను ఆ మాటలు అనలేదని వర్మ వివరణ ఇచ్చారు.

ఇక తాజాగా ద్రౌపదిపై వర్మ మరో ట్వీట్ చేశాడు. 'గౌరవనీయులైన ద్రౌపది జీపై నేను విస్తృతమైన పరిశోదన చేశాను. ఆ పరిశోధనలో ఆమె కళ్ల తీవ్రత, చిరునవ్వు, ముఖ రూపురేఖలు వాటిని చూస్తే అర్థమవుతోంది. ఆమె ప్రపంచం మొత్తంలో గొప్ప రాష్ట్రపతి అవుతారు. ఆమె నవ్వు చూస్తే హృదయంలోంచి వచ్చినట్టు స్వచ్చంగా ఉంది. కౌరవులు, పాండవులు పక్కనపెడితే ఈ ద్రౌపదిని అందరూ కలిసి గెలిపించుకొని కొత్త మహాభారతం రాస్తారు థాంక్యూ బీజేపీ' అని పోస్ట్ చేశారు. వర్మ చేసిన ఈ ట్వీట్ రాజకీయవర్గాల్లో మళ్లీ చర్చకు దారితీసింది. మరి పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.