Begin typing your search above and press return to search.

చెక్కులపై .. ఆర్బీఐ సంచలన నిర్ణయం !

By:  Tupaki Desk   |   26 Sep 2020 8:50 AM GMT
చెక్కులపై .. ఆర్బీఐ సంచలన నిర్ణయం !
X
బ్యాంకింగ్ వ్యవస్థ లో జరిగే మోసాలని అరికట్టడానికి జనవరి 1 , 2021 నుండి చెక్కులకు ‘పాజిటివ్‌ పే విధానం’ ప్రవేశపెట్టాలని ఆర్ ‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీని కింద రూ.50 వేలు పైబడిన విలువ గల చెక్కులకు సంబంధించిన కీలక వివరాలన్నింటినీ కస్టమర్లు తిరిగి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ సదుపాయం ఉపయోగించుకోవాలా, వద్దా అనేది ఖాతాదారుని విచక్షణకే వదిలి వేయనున్నారు. బ్యాంకుల్లో మోసాల నివారణకు ఆర్ ‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే , రూ.5 లక్షలకు పైబడిన చెక్కులకు మాత్రం ఈ విధానం తప్పనిసరిగా అమలుచేసే విషయం బ్యాంకులు పరిశీలించే అవకాశం ఉంది. ఈ విధానం కింద కస్టమర్లు చెక్కులను ఎలక్ట్రానిక్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. చెక్కు జారీ తేదీ, లబ్ధిదారుని పేరు, ఎవరు జారీ చేశారు, వారి బ్యాంకు ఏది వంటి విషయాలన్నీ ఎస్ ‌ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ , ఏటీఎం ద్వారా అందించాల్సి ఉంటుంది. బ్యాంకు సంబంధిత చెక్కును ప్రెజెంట్‌ చేసే ముందు ఆ వివరాలన్నీ ధ్రువీకరించుకుంటుంది. ఏవైనా లోపాలను చెక్‌ ట్రంకేషన్‌ సిస్టమ్‌ గుర్తించినట్టయితే తగు నివారణ చర్యలు తీసుకుంటారని ఆర్ ‌బీఐ వెల్లడించింది.

పాజిటివ్ పే వంటి విధానం ద్వారా వినియోగదారు ఇచ్చిన చెక్కును లబ్ధిదారు తన ఖాతాలోకి డిపాజిట్ చేయడానికి ముందే బ్యాంకుకు ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. చెక్కు ఎవరి పేరు మీద, ఎంత మొత్తానికి జారీ చేశారనే విషయాలు తెలుస్తాయి. డబ్బులు బదలీ చేయడానికి ముందే ఆ వివరాలను ముందస్తుగా తనిఖీ చేసేందుకు ఈ పద్ధతి మంచి వెసులుబాటు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు