కవితక్క కటాక్షం కోసం మళ్లీ క్యూలు

Thu Sep 23 2021 16:04:02 GMT+0530 (IST)

Queues again for a kavitha

ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ ఉమ్మడి నిజామాబాద్‌లో చక్రం తిప్పుతున్నారా? ఆమె కటాక్షం కోసం నేతలు మళ్లీ క్యూ కడుతున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత ఆమె మళ్లీ ఆక్టివ్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆమె అనుగ్రహం లేనిదో పదవులు దక్కవనే అభిప్రాయం జిల్లా నేతల్లో మళ్లీ మొదలైందని అందుకే ఆమెను ప్రసన్నం చేసుకోవడం కోసం హైదరాబాద్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన కవిత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కూడా పట్టు సాధించుకున్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవులైనా.. పార్టీ పదువులైనా దక్కాలంటే జిల్లా నేతలు ఆమె అనుగ్రహం కోసం వేచి చూసేవాళ్లు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు భారీ షాకిచ్చిన ప్రజలు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు అవకాశం ఇచ్చారు. ఈ ఓటమి తర్వాత చాలా కాలం పాటు ఆమె రాజకీయాలకు జిల్లాలకు దూరంగా ఉన్నారు. కానీ 2020లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన ఆమె మళ్లీ చక్రం తిప్పడం మొదలెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆర్టీసీ ఛైర్మన్ పదవి రావడం వెనక కవిత హస్తమే ఉందని జిల్లాలో చర్చించుకుంటున్నారు. దీంతో మరోసారి ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నాయకులు కవిత అండ కోసం క్యూ కడుతున్నారు. జిల్లాలో పార్టీ సంస్థాగత పదవులతో పాటు ఇతర పదవులు కూడా ఆమె చెప్పినవాళ్లకే దక్కుతున్నాయి. ఈ ఉమ్మడి జిల్లాకే చెందిన మంత్రులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కవిత అనుగ్రహం ఉంటేనే పదవుతు దక్కుతాయనే పరిస్థితి మళ్లీ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్ష పదవులు భర్తీపై చర్చ సాగుతోంది.

కవిత చెప్పినవాళ్లకే ఈ పదవులు దక్కుతాయనే ప్రచారం జోరందకుంది. ఈ పార్టీ సంస్థాగత రాజకీయాలకు కవిత కేంద్ర బిందువుగా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల అధ్యక్ష పదవుల్లో ఎమ్మెల్యేలు ఉండకూడదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పాడు. దీంతో ఇప్పుడు ఆ పదవులపై ఆశతో ఉన్న నాయకులు కవితను ప్రసన్నం చేసుకోవడానికి హైదరాబాద్‌కు వరుస కడుతున్నారని సమాచారం. ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎంపికైన తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ మొదటగా కవితనే కలవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. జిల్లా అధ్యక్ష పదవులతో పాటు నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులు ఆశిస్తున్న నేతలు కవిత కోసం ప్రదక్షిణలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.