ఖతర్ వింత ఫుట్ బాల్ స్టేడియం విశేషాలు

Thu Jul 22 2021 05:00:01 GMT+0530 (IST)

Qatar Strange Football Stadium Highlights

చాలా వరకు క్రికెట్ స్టేడియాలు కానీ ఫుట్ బాల్ స్టేడియాలు కానీ చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిని నిర్మించడం కోసం చాలా మొత్తంలో ఖర్చవుతూ ఉంటుంది. అలాగే రాబోవు తరాల వారికి కూడా ఈ స్టేడియాలు ఉపయోగపడేలా వీటిని నిర్మిస్తుంటారు. చాలా దేశాల ప్రభుత్వాలు స్టేడియాల నిర్మాణాల కోసం అనేక కోట్ల రూపాయలను వెచ్చిస్తూ... ఉంటాయి. ఇలా వెచ్చించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇప్పుడు చేసిన ఖర్చును భవిష్యత్ లో రాబట్టుకోవచ్చు. అని ఆలోచిస్తూ ఉంటాయి. ఇలాగే ఇంగ్లండ్ లో నిర్మించిన ప్రఖ్యాతి గాంచిన క్రికెట్ స్టేడియం చాలా సంవత్సరాల కిందటిది. కానీ ఇప్పటికీ ఆ స్టేడియం చెక్కు చెదరకుండా ఉంది.ఈ స్టేడియం తర్వాత ఎన్ని స్టేడియాలు నిర్మించినా... ఆ స్టేడియం కు ఉన్న రాజవైభోగం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎక్కడైనా స్టేడియాలు ఇలా ఏళ్ల పాటు ఉండేలా నిర్మిస్తారు. కానీ ప్రస్తుతం మారుతున్న కాలానికనుగుణంగా ప్రభుత్వాలు కూడా మారాలని సంకల్పించుకున్నాయేమో అని అనిపించేలా ఎడారి దేశం అయిన ఖతర్ లో కడుతున్న స్టేడియం కోసం ఇలా ఏళ్లకు ఏళ్లు ఉండాలని అక్కడి ప్రభుత్వం అనుకోవడం లేదు. అందుకే ఈ విధానానికి స్వస్తి పలికి నూతన విధానాన్ని అవలంభిచడం మొదలు పెట్టింది. ఇప్పుడు కట్టి మరలా ఆటలు ముగిసిన తర్వాత విప్పేసుకునే విధంగా  అక్కడి స్టేడియాన్ని కడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని కొంత మంది అంటున్నారు.

రాబోయే సాకర్ ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు. ఈ ప్రపంచకప్ కోసం ఖతర్ లో 40 వేల మంది కూర్చునేలా ఒక స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... స్టేడియం నిర్మాణం కోసం అవలంభిస్తున్న తీరే చాలా విచిత్రంగా ఉంది. ఈ స్టేడియాన్ని మరలా విప్పేసుకునేందుకు వీలుగా నిర్మించడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. స్టేడియాన్ని అసలు ఇలా కూడా కడతారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ స్టేడియం నిర్మాణాన్ని ఖతర్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఖతర్ లో ప్రస్తుతం నిర్మిస్తున్న రాస్ అబు అబౌడ్ స్టేడియం పూర్తయ్యే దశలో ఉంది. ఇందులో ఉన్న కుర్చీల దగ్గరి నుంచి అన్నింటిని ఊడదీసుకుని పోయేలా నిర్మిస్తున్నారు. భారీగా కడుతున్న ఈ స్టేడియం ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఈ స్టేడియం నిర్మాణం గురించి విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ... అలా ఎలా కడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలు స్టేడియాలు నిర్మిస్తే కొన్ని సంవత్సరాల పాటు ఉండేలా కడతారు ? కదా అని అడుగుతున్నారు.

ఇక్కడ సాకర్ ప్రపంచకప్ పోటీలు అయిపోయిన తర్వాత ఈ స్టేడియాన్ని ఏ భాగానికి ఆ భాగం విప్పేసుకుపోతారట. ముందు ముందు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పోర్టబుల్ స్టేడియాలు నిర్మాణం జరుగుతాయేమో చూడాలి. ఏ ప్రదేశంలో కావాలంటే ఆ ప్రదేశంలో స్టేడియాలను నిర్మించుకునే వెసులుబాటు ఉంటే ముందు ముందు క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.