Begin typing your search above and press return to search.

పోస్కోకు విశాఖ ఉక్కు దాసోహం తప్పదా? షాకింగ్ గా ఎంవోయూ!

By:  Tupaki Desk   |   1 March 2021 3:58 AM GMT
పోస్కోకు విశాఖ ఉక్కు దాసోహం తప్పదా? షాకింగ్ గా ఎంవోయూ!
X
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కును ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దక్షిణ కొరియా స్టీల్ దిగ్గజం పోస్కోతో విశాఖ ఉక్కు కుదుర్చుకున్న ఎంవోయూ లెక్క చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఒప్పందం అంటే ఇరువురికి లాభదాయంగా ఉండాలి కానీ..ఏకపక్షంగా పోస్కోకు అనుకూలంగా ఉండకూడదు కదా?

ప్రైవేటు పోస్కోకు విశాఖ ఉక్కు దాసోహమయ్యేలా సాగిన ఎంవోయి వివరాలు బయటకు వచ్చాయి. వీటిని చూస్తే.. ఉలికిపాటే కాదు.. వ్యూహాత్మకంగానే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు. ఆంధ్రుల హక్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు ఏడాది క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తొలుత విశాఖ ఉక్కు ఆవరణలో కాస్తంత స్థలాన్ని తీసుకొని.. నెమ్మదిగా విస్తరిస్తూ.. మొత్తంగా సొంతం చేసుకోవాలన్నదే పోస్కో ప్లానా? అంటే అవునన్న సందేహం కలుగక మానదు. దీనికి తగ్గట్లే ఏడాదిన్నర క్రితం కుదిరిన ఒప్పందానికి సంబంధించిన అంశాలు తాజాగా తెర మీదకు వస్తున్నాయి.

విశాఖకు చెందిన ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద పోస్కోతో జరిగిన ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని కోరగా.. అధికారులు ఇచ్చారు. అందులోని అంశాలన్ని పోస్కోకు అనుకూలంగా ఉండటం గమనార్హం. విశాఖ లాంటి నగరంలో 1167 ఎకరాల్ని సేకరించటం మాటలు కాదు. జాయింట్ వెంచర్ కంపెనీ పేరుతో పోస్కో సంస్థ గంగవరం పోర్టుకు సమీపంలో 1167 ఎకరాల్లో పాగా వేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా ఉంది.

కొత్త కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు పోస్కో నగదురూపంలో పెట్టుబడి పెడితే.. విశాఖ ఉక్కు తన వాటాగా భూమిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోస్కో కోరితే మరింత భూమిని ఇచ్చేందుకు ఒప్పందంలోని అంశాలు ఉండటం విశేషం. వాస్తవానికి ఈ భూమిని విశాఖ ఉక్కు కోసం నిర్వాసితులకు ఇచ్చింది ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవటం షాకింగ్ గా మారింది.

మరింత దారుణమైన అంశం ఏమంటే.. ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకునేటప్పుడు భారత చట్టాలకు లోబడి అని రాసుకుంటారు. కానీ.. పోస్కోతో ఒప్పందంలో మాత్రం సంబంధం లేని సింగపూర్ చట్టాలకు లోబడి ఒప్పందం ఉంటుందని పేర్కొనటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా వివాదాలు తలెత్తితే సింగపూర్ కోర్టులో తేల్చుకోవాలని చెప్పటం దేనికి నిదర్శనం? కొత్తగా ఏర్పాటు చేసే కర్మాగారంలో తయారు చేసే హాట్ రోల్డ్ కాయిల్స్ ను మహారాష్ట్రలో ఇప్పటికే ఉన్న పోస్కో కంపెనీకే అమ్మాలన్న రూల్ ఎంవోయూలో ఉండటం కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉంది. ధర కూడా సదరు పోస్కోకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూల్ రాసుకోవటం దేనికి నిదర్శనం?

పేరుకు జాయింట్ వెంచరే కానీ తలనొప్పులన్ని విశాఖ ఉక్కువే కావటం గమనార్హం. కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు లైసెన్సులు.. పర్యావరణ అనుమతులు అన్నింటిని సంపాదించే బాధ్యత విశాఖ ఉక్కే తీసుకోవాలి. విద్యుత్.. నీరు.. ఇతరత్రా అవసరాల క్లియరెన్సులు తెప్పించే బాధ్యత కూడా విశాఖ ఉక్కుదేనట. కొత్త ఫ్యాక్టరీ కోసం గంగవరం పోర్టును వాడుకునేందుకు అనుమతించాలని.. కొత్త కర్మాగారానికి అవసరమైన రైలు.. రోడ్డు.. ఇతర మౌలిక సదుపాయాలకు అనుమతులు కూడా విశాఖ ఉక్కే తెచ్చుకోవాలన్న క్లాజులు చూస్తే.. పోస్కో చేసేదేమిటి? అన్న సందేహం కలుగక మానదు. కొత్త అల్లుడికి మించిన మర్యాదల్ని డిమాండ్ చేస్తున్న పోస్కోతో అసలు ఎంవోయూ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలీ ఒప్పందం వెనుక ఆసక్తి ఉన్నదెవరికి? అన్నదిప్పుడు అతి పెద్ద ప్రశ్నగా చెప్పక తప్పదు.