Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లను ఇంగ్లాండ్ లో పెట్టండి.. పీటర్సన్ సూచన

By:  Tupaki Desk   |   9 May 2021 11:30 AM GMT
ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లను ఇంగ్లాండ్ లో పెట్టండి.. పీటర్సన్ సూచన
X
దేశంలో కరోనా ప్రబలిన మొదటి సంవత్సరం ఐపీఎల్ ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించారు. అయితే దేశంలో మళ్లీ కరోనా సెకండ్ ఉంటుందని వైద్యనిపుణులు ఒకవైపు హెచ్చరిస్తున్నా రెండో ఏడాది ఐపీఎల్ ను దేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు అందరినీ బయో బబుల్లో ఉంచి కరోనాకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఐపీఎల్ నిర్వహించవచ్చని భావించింది. అయితే ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లోనే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరం అయ్యింది. చూస్తుండగానే దేశంలో రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదవడం ప్రారంభమయింది.

అయితే ఆ సమయంలో ఐపీఎల్ ను నిర్వహించడం అంత అవసరమా అని చాలామంది ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఎన్ని విమర్శలు ఎదురైనా బీసీసీఐ పాలకులు మాత్రం ఐపీఎల్ ను కొనసాగించారు. అయితే మెల్లగా కరోనా వైరస్ బయో బబుల్ ను ఛేదించింది. ముందుగా కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ముగ్గురు పాజిటివ్ బారినపడ్డారు. ఆ వెంటనే చెన్నై శిబిరంలో కరోనా కలకలం సృష్టించింది. జట్టు కోచ్ మైక్ హస్సీ, బౌలింగ్ కోచ్ బాలాజీ, ఇంకో వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

ఆ తర్వాత సన్ రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా కు కరోనా సోకింది. ఇక పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత సెప్టెంబర్ లో మళ్లీ మిగిలిన మ్యాచ్ లను నిర్వహిస్తామని తెలిపింది. అయితే తాజాగా ఐపీఎల్ నిర్వహణపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ మ్యాచ్ లను ఇంగ్లాండ్ లో నిర్వహించాలని పీటర్సన్ సూచించాడు. సెప్టెంబర్లో మ్యాచ్ ల నిర్వహణకు ఇంగ్లాండ్ వాతావరణం అద్భుతంగా ఉంటుందని పీటర్సన్ చెప్పాడు.

ఎలాగూ కరోనా కారణంగా ఇండియా లో జరుగుతున్న మ్యాచ్ లకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు. అదే ఇంగ్లాండ్లో అయితే అక్కడి ప్రభుత్వం ప్రేక్షకులకు కూడా అనుమతి ఇస్తుందని తెలిపాడు. ప్రేక్షకుల మధ్య మ్యాచ్ లు నిర్వహించడం అంటే ఆటగాళ్లకు కూడా ఉత్సాహంగా ఉంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. పీటర్సన్ చేసిన సూచన బాగున్నా అందుకు బీసీసీఐ ఒప్పుకుంటుందో లేదో, లేకపోతే గత ఏడాదిలాగే యూఏఈ లో మిగిలిన మ్యాచ్ ను నిర్వహిస్తుందేమో వేచి చూడాలి.