పూరి సోదరుడు.. ఎట్టకేలకు సాధించాడు..

Fri May 24 2019 17:47:27 GMT+0530 (IST)

Puri Jagan Brother Uma Shankar Ganesh Win In 2019 Elections

గురువును శిష్యుడు ఓడించాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు అద్భుతమే చేశారు. ఈసారి వైసీపీ గాలిలో పూరి సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఘనవిజయం సాధించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి 22వేల మెజార్టీతో ప్రత్యర్థి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని ఓడించి సంచలనం సృష్టించాడు.2014లో కూడా ఉమాశంకర్ వైసీపీ తరుఫున బరిలోకి దిగి తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన అయ్యన్నపాత్రుడు చేతిలో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీలోనే రాజకీయంగా గ్రామ మండలస్థాయి నాయకుడిగా ఎదిగిన ఉమాశంకర్ అనంతరం అయ్యన్నకు నమ్మిన బంటుగా శిష్యుడిగా ఉంటూ రాజకీయంగా ఎదిగారు. 2014లో వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకొని గురువుపైనే పోటీకి దిగారు. కానీ అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమి ధాటికి నిలవలేక ఓడిపోయారు. ఆ తర్వాత గెలిచిన అయ్యన్న టీడీపీలో మంత్రిగా బలమైన నేతగా ఎదిగారు..

కానీ ఈసారి మాత్రం ఉమాశంకర్ కు జగన్ వేవ్ వైసీపీ గాలి తోడైంది. గురువుపై మరోసారి బరిలోకి దిగి మంచి మెజార్టీతో ఏకంగా రాష్ట్రమంత్రి అయ్యన్నను ఓడించి సంచలనం సృష్టించాడు. గత సారి గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓడిన ఉమాశంకర్ ఈసారి మాత్రం 90వేలకు పైగా ఓట్లు సాధించి గెలిచారు. ప్రతి పదేళ్లకు ఓడిపోవడం అయ్యన్నకు అలవాటుగా మారింది. 1989 2009 2019లో ఆయన రెండు సార్లు గెలుస్తూ ఓడిపోతుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.