అనూహ్యం.. అవినీతి మకిలి.. పంజాబ్ మంత్రిపై వేటు.. అరెస్టు కూడా..

Tue May 24 2022 17:00:01 GMT+0530 (IST)

Punjab Minister Arrested

మూడు నెలల కిందటి ఎన్నికల్లో పంజాబ్ లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). ప్రధాన ప్రత్యర్థులు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీని మట్టికరిపించి ఔరా అనిపించింది. ఆ సమయంలోనే అవినీతిని సహించబోమని ఆప్ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా తన పాలన ఎలా ఉండబోతోందో స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి మిగతా సంప్రదాయ పార్టీల కంటే ఆప్ పాలన భిన్నంగా ఉంటుంది. ఆ విషయం ఢిల్లీలో రుజువైంది.సజావుగా సాగుతున్న వేళ..

ప్రధాన పార్టీలు కనీస స్థాయిలో సీట్లు సాధించలేక.. కనీసం నోరు కూడా ఎత్తలేని పరిస్థితుల్లో పంజాబ్ లో ఆప్ ఏకఛత్రాధిపత్యం చూపింది. ప్రస్తుతం పాలన కూడా సజావుగా సాగుతోంది. నెల కిందటే ఏకంగా 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం భగవంత్ మాన్ సంతకం చేశారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు కూడా ఒక్కోటి కార్యరూపంలోకి తెస్తున్నారు. అలాంటిది.. ఒక్కసారిగా ప్రభుత్వంలో కుదుపు. అవినీతికి పాల్పడ్డారంటూ ఏకంగా మంత్రిపైనే వేటు వేశారు. అరెస్టు కూడా చేశారు. ఇది రాజకీయాల్లో అనూహ్య పరిణామమే. దీని ప్రభావం ఆప్ పాలనపై పడుతుంది కూడా. మిగతా పార్టీలు ఆప్ ను ప్రశ్నించకుండా ఉండలేవు కూడా.

అసలేం జరిగింది..?

పంజాబ్ ఆరోగ్య శాఖలో పరికరాల కొనుగోలులో మంత్రి విజయ్ సింగ్లా కమిషన్ అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో సీఎం మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సింఘ్లాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే చేసిన తప్పులను సింఘ్లా ఒప్పుకున్నట్లు కూడా సీఎం తెలిపారు.

ఈ మేరకు బుధవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై తమవద్ద సమాచారం ఉందని వాటిపై విచారణ చేయిస్తామని సీఎం చెప్పారు. ఇక ఆరోగ్య శాఖ మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన సీఎం కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు మంత్రిని అరెస్ట్ చేయడం గమనార్హం.